Wednesday, August 13, 2025

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు: మంత్రి అడ్లూరి

- Advertisement -
- Advertisement -

గురుకులాలకు కోడిగుడ్ల సరఫరా చేసేందుకు జరిగిన టెండర్లలో రూ.600 కోట్ల అవినీతి జరిగిందంటూ బిఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మండిపడ్డారు. జగిత్యాల మెడికల్ కళాశాల అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ..కోడిగుడ్ల సరఫరాకు సంబంధించి టెండర్ ప్రక్రియ జరుగుతోందని, టెండర్ ప్రక్రియలో ఉండగా రూ.600 కోట్ల అవినీతి ఎలా జరిగిందో స్పష్టం చేయాలని నిలదీశారు. ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెలిసీ తెలియక మాట్లాడితే సహించేది లేదన్నారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేసి బిఎస్‌పి నేతగా గురుకులాల విషయంలో, పరిపాలనలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఎన్ని విమర్శలు చేశారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు.

పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ఏ ఒక్కరోజైనా కెసిఆర్, మంత్రులు గురుకులాలకు వెళ్లి విద్యార్థుల కష్ట సుఖాలను తెలుసుకునే ప్రయత్నం చేశారా, వారితో కలిసి ఏనాడైనా భోజనం చేశారా అని నిలదీశారు. గురుకులాల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుందనే విషయంపై లోతుగా విచారణ చేపట్టి అల్యూమినియం పాత్రల వల్లే జరుగుతుందని గుర్తించామని అన్నారు. వాటి స్థానంలో రూ.7 కోట్లు వెచ్చించి స్టీల్ వంట పాత్రలను అందించామని అన్నారు. గురుకులాలకు గత ప్రభుత్వం బకాయి పడ్డ రూ.400 కోట్లు తమ ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. బకాయి లేనివి లేకుండా చేసేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి గురుకులాల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జిఓ 17 గురించి పూర్తి అవగాహన లేని ప్రవీణ్‌కుమార్ అవినీతి జరిగిందంటూ మాట్లాడటం చూస్తే ఆశ్చర్యం వేస్తోందని అన్నారు. ఆయనతో మాట్లాడించిన వారు కూడా వాస్తవాలు తెలుసుకోవాలని చురకలంటించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి,

మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యనందించాలనే గొప్ప సంకల్పంతో తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇంటిగ్రేటేడ్ స్కూల్‌ను మంజూరు చేసిందని అన్నారు. రూ.200 కోట్లతో 25 ఎకరాల స్థలంలో అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించేందుకు టెండర్ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. తమది సంక్షేమ ప్రభుత్వమని, సంక్షేమ శాఖ మంత్రిగా గురుకులాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు గాజెంగి నందయ్య, ఒరుగల శ్రీనివాస్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News