Wednesday, July 30, 2025

ఒక్క సంతకంతో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు: మంత్రి సురేఖ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే తొలిసారిగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కే అరుదైన అవకాశం ఒక్క సంతకం దూరంలో ఉందని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రాష్ట్రపతి బిసి బిల్లుపై సంతకం చేసేలా విజ్ఞప్తి చేసేందుకు బీసీ బిడ్డలరా కదలి రావాలని ఆమె పిలుపు నిచ్చారు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమానికి విధిగా హాజరు కావాలని మంగళవారం మంత్రి తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం సాధించేందుకు గాను బిసి బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయాలని ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

బిసిల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమి ఎంపీలంతా హాజరవుతారని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులందరితో ఆగస్టు 6న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి, జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొంటారని తెలిపారు. దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్లు ఆమోదం కోరుతూ తర్వాతి రోజు వీరంతా వినతి పత్రం అందించనున్నారు. రాష్ట్రపతి అపాయింట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి సురేఖ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News