భద్రాచలం భూముల వివాదం చాలా రోజులుగా నడుస్తోందని, ఏడు మండలాలను ఏపిలో కలవడం వల్లే ఈ గొడవలు మొదలయ్యాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. భద్రాచలం భూముల వివాదంపై మంత్రి కొండా సురేఖ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆలయ భూముల్లో ఇప్పటికే 60 కట్టడాలు వచ్చాయని, చాలా రోజుల నుంచి వారికి నచ్చజెబుతున్నామని మంత్రి తెలిపారు. కానీ, ప్రతిసారి గొడవలు జరుగుతూనే ఉన్నాయని ఈసారి ఏకంగా దాడి చేసే ప్రయత్నం చేశారని మంత్రి పేర్కొన్నారు. దీనిపై ఏపిలో కేసు నమోదు చేయాల్సి ఉందన్నారు. అందుకే తాము చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని మంత్రి తెలిపారు.
ఈ వ్యవహారంపై ఎపి ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని, ఈ అంశంపై ఇప్పటికే ఏపి ప్రభుత్వానికి లేఖ రాశామని, వారితో మాట్లాడాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కను సైతం విజ్ఞప్తి చేశామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. భద్రాచలం ఆలయానికి సంబంధించిన 889.5 ఎకరాల భూమి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తంపట్నంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూములను స్థానికులు కబ్జా చేస్తుండడంతో భద్రాచలం ఆలయ అధికారులు కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు ఆధారంగా వాటిని రక్షించుకోవడానికి దేవాదాయ శాఖ అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్న స్థానికులు మాత్రం కబ్జా చేయడం మాత్రం ఆపడం లేదు.