Wednesday, July 23, 2025

నాకసలు రమ్మీ ఆడటమే తెలియదు.. వైరల్ వీడియోపై స్పందించిన మంత్రి

- Advertisement -
- Advertisement -

నాసిక్ : అసెంబ్లీ సమావేశాల్లో మహారాష్ట్ర మంత్రి మాణిక్‌రావ్ కోకాటే రమ్మీ ఆడారంటూ ఓ వీడియోను విపక్షాలు వైరల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి మాణిక్‌రావ్ కోకాటే స్పందించారు. తనకు అసలు ఆన్‌లైన్ రమ్మీ ఆడటమే తెలియదని మీడియాతో మాట్లాడారు. ఆ గేమ్ ఆడాలంటే బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి. నా నంబర్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఆ సమయంలో నా ఫోన్ తెరపై రమ్మీకి సంబంధించి వచ్చిన పాప్ అప్‌ను స్కిప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ” అని మంత్రి వివరణ ఇచ్చారు. దీనిపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

ఆ వీడియోపై విచారణ చేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాస్తానని వెల్లడించారు. మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్ కోకాటె అసెంబ్లీ సమావేశాల సమయంలో ఫోన్‌లో రమ్మీ ఆడుతున్నారని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం ) ఎమ్‌ఎల్‌ఏ రోహిత్ పవార్ ఆరోపిస్తూ కొన్ని దృశ్యాలను నెట్టింట్లో పంచుకున్నారు. రైతులు, వ్యవసాయ సమస్యల గురించి సభలో చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి ఇలా వ్యవహరించారని మండి పడ్డారు. రాష్ట్రంలో రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. అయినప్పటికీ వ్యవసాయ మంత్రి వీటన్నింటినీ పట్టించుకోకుండా ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఇక ఈ సంఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదని ఆరోపిస్తున్నాయి. దీనిపై శివసేన (యూబీటీ) ప్రతినిథి ఆనంద్ దూబే స్పందిస్తూ, మంత్రి కోకాటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కోకాటె రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత, డిప్యూటీ సిఎం అజిత్ పవార్ ఈ వీడియో వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటారని, ఆ మంత్రితో చర్చిస్తారని ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కారే సోమవారం వెల్లడించారు. మంత్రి కొకాటే వివాదాలకు కొత్తేమీ కాదు. రైతులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలో పెట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News