మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం అసాధ్యం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వ్యాఖ్యానించినందుకు నిరసనగా ఆ పార్టీ తెలంగాణ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బిసిలకు బిజెపి వ్యతిరేకమని తాను మొదటి నుంచీ చెబుతున్నానని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాంచందర్ రావు మరోసారి తన అసలు స్వరూపం బయట పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. బిసిలకు 42 శాతం రిజరేషన్లు కల్పించడం సాధ్యమేనని అన్నారు. గతంలో తమిళనాడు ప్రభుత్వం కల్పించిందని ఆయన ఉదహరించారు. రామచందర్ రావు వైఖరికి నిరసనగా ఆ పార్టీ ఎంపీలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
యువతకు 20 శాతం సీట్లు ఇవ్వండి: సిఎంను కోరిన శివ చరణ్ రెడ్డి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 20 శాతం సీట్లు ఇవ్వాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.