మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్‌టిసి బస్సులలో అందుతున్న ఉచిత ప్రయాణంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సులో స్వయంగా ప్రయాణించి మహిళల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లా, కొండపాక మండల పరిధిలోని రాజీవ్ రహదారిపై దుద్దెడ టోల్‌ప్లాజా నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు బుధవారం ఆయన ఆర్‌టిసి బస్సులో ప్రయాణం చేశారు. కరీంనగర్ డిపోకి చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సులో ఎక్కువ మంది మహిళా ప్రయాణికులు ఉండడంతో మహాలక్ష్మి పథకాన్ని మహిళా ప్రయాణికులు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. తమకు బస్సులో ఉచిత ప్రయాణం వల్ల చాలా డబ్బులు ఆదా అవుతున్నాయని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన బస్సులో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులతో మాట్లాడారు. ఉచిత సేవలను వినియోగించుకొని బాగా చదువుకోవాలని సూచించారు.ఆర్‌టిసికి ప్రతి నెల ప్రభుత్వం రూ.330 కోట్లు చెల్లిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం ఆర్‌టిసి సంస్థను నిర్వీర్యం చేస్తే తాము నిలబెట్టామని గర్వంగా తెలిపారు. కొత్త బస్సులు కొనుగోలు చేశామని, దేశానికి తెలంగాణ ఆర్‌టిసి రోల్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌తో మాట్లాడుతూ.. ఆర్‌టిసి సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తామని మంగళవారం జెఎసి నాయకులతో జరిగిన సమావేశంలో చెప్పామని గుర్తు చేశారు. సమ్మెపై వెనక్కి తగ్గి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసినందుకు ఆర్‌టిసి ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.