Wednesday, September 10, 2025

టిజిఎస్ ఆర్‌టిసి వినూత్న సేవా కార్యక్రమం- ‘యాత్రాదానం’

- Advertisement -
- Advertisement -

సామాజిక బాధ్యతలో భాగంగా ‘యాత్రాదానం’ అనే వినూత్న కార్యక్రమానికి టిజిఎస్ ఆర్‌టిసి శ్రీకారం చుట్టింది. వ్యక్తుల పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభ కార్యాలు, తదితర ప్రత్యేకమైన, ఆనందదాయకమైన రోజుల్లో అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహార యాత్రలకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తాము జరుపుకునే శుభదినాన తగిన మొత్తాన్ని సంస్థకు విరాళంగా అందజేయడం ద్వారా వారికి ఆర్‌టిసి బస్సు సదుపాయం కల్పిస్తుంది. హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంగళవారం యాత్రాదానం కార్యక్రమ పోస్టర్ ను రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టిసి ఎండి సజ్జనార్ తో పాటు ఈడీలు మునిశేఖర్, రాజశేఖర్, ఖుష్రోషా ఖాన్, వెంకన్న, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప, హెచ్‌ఓడీలు శ్రీధర్, శ్రీదేవి, ఉషాదేవి, ప్రభులత, కవిత, తదితరులు పాల్గొన్నారు. యాత్రదానం కార్యక్రమ నిర్వహణ కోసం పేరుతో ప్రత్యేక నిధిని సంస్థ ఏర్పాటు చేసింది.

వ్యక్తులతో పాటు ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్‌ఆర్‌ఐలు, అసోసియేషన్స్, ఎన్‌జిఓలు స్పాన్సర్ చేసి అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ దేవాలయాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు తీసుకెళ్లొచ్చు. సంతోషకరమైన రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా ఇతరుల్లోనూ ఆనందం కలిగించవచ్చు. ఈ యాత్రాదాన కార్యక్రమాన్ని వ్యక్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా వినియోగించుకోచ్చు. యాత్రాదాన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలను కవర్ చేస్తే ప్రత్యేక టూర్ ప్యాకేజీలను సంస్థ రూపొందించింది. దాతలు చెల్లించే విరాళం మేరకు కిలోమీటర్ల ఆధారంగా ఎసి, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను విహారయాత్రలకు సంస్థ ఏర్పాటు చేస్తుంది. టూర్ ప్రారంభానికి వారం రోజుల ముందు బస్సులను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.స్థానిక ఆర్‌టిసి డిపో అధికారులను సంప్రదించి యాత్రాదానం కింద బస్సులను బుకింగ్ చేసుకోవచ్చు. ఆర్‌టిసి హెల్ప్ లైన్ నంబర్లు 040 69440000, 040 23450033 కాల్ చేసి సమాచారం ఇస్తే సంబధిత ఆర్‌టిసి అధికారులు ఫోన్ చేసి యాత్రాదాన టూర్ ప్యాకేజీల వివరాలను తెలియజేస్తారు.

యాత్రాదానం వినూత్న ఆలోచన : మంత్రి పొన్నం
యాత్రాదాన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా వినూత్న ఆలోచనతో యాత్రాదానం కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తున్న ఆర్‌టిసి యాజమాన్యాన్ని అభినందించారు. ప్రసిద్ధ దేవాలయాలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని చాలా మందికి ఉంటుందని, అలాంటి వారికి యాత్రాదానం కార్యక్రమం ఒక వరమని అన్నారు. కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా టిజిఎస్ ఆర్‌టిసి యాత్రానిధికి విరాళాలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తులు కూడా తమ ప్రత్యేకమైన, ఆనందదాయమైన రోజుల్లో అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులకు యాత్రలను దానం చేసి తమ ఉదారతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం క్షేత్ర స్థాయిలో విజయవంతం చేయడంలో ఆర్‌టిసి సిబ్బంది కృషి చేయాలన్నారు.

ప్రజలకు మెరుగైన ర్వాణా సేవలను అందించడంతో పాటు సామాజిక బాధ్యత గల సంస్థగా ముందుకు వచ్చి యాత్రాదానం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఆర్‌టిసి ఎండి సజ్జనార్ అన్నారు. భారతదేశంలోనే మొదటిసారిగా ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తోందని ఆయన వెల్లడించారు. ఇది సామాజిక సేవ మాత్రమే కాదని, సాంస్కృతిక విలువల పరిరక్షణతో పాటు సమాజానికి ఇచ్చే మానవత్వపు బహుమతి అని, అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, నిరుపేద విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లడం ద్వారా వారికి జీవితంలో మరపురాని అనుభూతి కలుగుతుందన్నారు. ఇది ఆధ్యాత్మిక ఆనందంతో పాటు సాంస్కృతిక అవగాహనను కలిగిస్తుంది. దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని కోరారు. ముఖ్యంగా సమాజ హితానికి ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్‌జిఓలు యాత్రాదానాన్ని వినియోగించుకోవాలన్నారు.

యాత్రాదానం నిధికి మంత్రి పొన్నం, సజ్జనార్ చెరో లక్ష విరాళం
యాత్రాదానం నిధికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్‌టిసి ఎండి సజ్జనార్ చెరో లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ విరాళానికి సంబందించిన చెక్ లను ఆర్‌టిసి ఉన్నతాధికారులకు అందజేశారు. మంత్రి విరాళాన్ని అనాథలు, నిరాశ్రయులైన వృద్దులకు, నిరుపేద విద్యార్థుల విహారయాత్రలకు వినియోగించనుండగా, ఆర్‌టిసి ఎండి సజ్జనార్ విరాళాన్ని అక్షయ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు తాడ్ బండ్ లోని సైన్స్ సెంటర్ లో సైన్స్ ప్రయోగాలు వీక్షించేందుకు వెళ్లేందుకు రవాణా సదుపాయం కోసం ఉపయోగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News