కరోనా వ్యాధిని ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాలని అడిగినందుకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఆమె విచారణకు హాజరైయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని 2021 ఏప్రిల్‌లో ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష చేసినట్లు గుర్తు చేశారు. కరోనాలో పేద ప్రజలు చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుని లక్షలు ఖర్చు చేసుకున్నారని ఆవేదనతో దీక్ష నిర్వహించామని తెలిపారు. నాడు తనతో పాటు దీక్ష చేసిన అప్పటి ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, హైదరాబాద్ ఇండస్ట్రీ అధ్యక్షుడు అభిజిత్‌తో పాటు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారనన్నారు.
కరోనా కలంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు భరోసా కల్పించి అండగా నిలిచామని, అలాంటి మాపై కరోనా వ్యాప్తి చేస్తున్నామని కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు వెచ్చించలేక ఎందరో ప్రాణాలు కోల్పోయారని, దీంతో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే ఉద్దేశ్యంతో ధర్నా చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తమ సీనియర్ న్యాయవాదులు కృష్ణ కుమార్ గౌడ్, ఎస్‌ఎస్‌రావు, నరేందర్‌లు కోర్టుకు వివరించారన్నారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఆగస్ట్ 13వ తేదీకి వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు. కెసిఆర్ తప్పుడు కేసుల కారణంగానే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. కోర్టులపై నమ్మకం ఉందని, నిర్దోషులుగా నిరూపించుకుంటామని మంత్రి పేర్కొన్నారు.