Tuesday, September 9, 2025

అబద్ధాల అంబాసిడర్‌గా కెటిఆర్:మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఒక అబద్దాల అంబాసిడర్ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మైదం మహేష్ విషయంలో కేటీఆర్ అబద్దాలు మానుకొని నిజాల మీద బతకాలని హితవు పలికారు. ములుగులోని మల్టి పర్పస్ వర్కర్ మైదం మహేష్ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్ వాడుకోవడం చాలా సిగ్గుచేటని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. టీఆర్‌ఎస్ హయాంలో పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు రాక సమ్మెలు చేసిన రోజులు ప్రజలు మరిచిపోలేదని గుర్తు చేశారు. మంత్రి సోమవారం నాడిక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు.

సిరిసిల్ల నుంచి సిద్దిపేట దాకా కలెక్టరేట్ల ఎదుట సఫాయి అన్నలు నిరసనలు చేస్తే పట్టించుకోని మీరు, నేడు మొసలి కన్నీరు కారిస్తే కార్మికులు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ప్రతి నెల జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం గ్రీన్ ఛానెల్ విధానాన్ని ప్రవేశపెట్టి, జీతాలు ఆలస్యం కాకుండా సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. మీ హయాంలో ఎప్పుడు జీతం వస్తుందో తెలియక ఇబ్బంది పడిన 50 వేల మందికి పైగా ఎం.పీ.డబ్ల్యూ కార్మికులకు ఇప్పుడు ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. ములుగులో మైదం మహేష్ జీతం ఆలస్యం కావడంలో ప్రభుత్వ తప్పిదం లేదని వివరణ ఇచ్చారు. జీతం ప్రాసెస్ చేసే సమయంలో స్థానిక పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వలన రెండు నెలల వేతనం ఆలస్యమైందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి, ములుగులో వందలాది మందికి జీతాలు సమయానికి అందాయని తెలిపారు.

మహేష్ విషయంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు
మహేష్ విషయంలో మాత్రమే ఇలాంటి నిర్లక్ష్యం జరిగిందని పేర్కొంటూ అది కూడా స్థానిక సిబ్బంది పొరపాటుతో జరిగిందని వివరణ ఇచ్చారు. బాధ్యులపై తక్షణ చర్య తీసుకొని పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి, బిల్ కలెక్టర్‌ను విధులనుంచి తొలగించామని మంత్రి సీతక్క ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మైదం మహేష్ కుటుంబానికి పరిహారం అందించడం జరిగిందని, కింది స్థాయి సిబ్బంది కారణంగా మైదం మహేష్ జీతం ఆలస్యం అయ్యింది తప్ప బడ్జెట్ లేక కాదని జీతం అందుకున్న మిగిలిన కార్మికులు, కార్మిక నాయకులు స్పష్టం చేశారు. ములుగు నూతన మున్సిపాలిటీగా ఏర్పాటైన క్రమంలో పంచాయతీ పద్దు నుంచి మున్సిపాలిటీ శాఖలోకి కార్మికులను మార్చి జీతాల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. మంచి నీళ్లు అనుకుని పొరపాటున పురుగుమందు

తాగానని మైదం మహేష్ స్వయంగా చెప్పిన రికార్డులు ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ దాన్ని రాజకీయంగా వాడుకోవడం, శవ రాజకీయాలు చేయడం కేటీఆర్ కే చెల్లిందని విమర్శించారు. కేటీఆర్ పదేపదే అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, ఒక అబద్ధాన్ని నూరుసార్లు చెప్పి నిజమని నమ్మించడమే గోబెల్స్ పాఠమని మంత్రి పేర్కొన్నారు. అయితే కేటీఆర్ దానిని మించి పోయారని విమర్శించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గంలో సర్పంచ్ లు, కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పట్టించుకోలేదని ఆరోపించారు. ముగ్గురు పిల్లలున్నారని ఆదుకోవాలని ఓ తల్లి విజ్ఞప్తి చేస్తే నా కోసం పిల్లల్ని కన్నవా అని అవమానాలకు గురి చేశాడని గుర్తు చేశారు. అలాంటి కేటీఆర్ ఇప్పుడు అధికారం పోగానే ప్రజల మీద కపట ప్రేమ ప్రదర్శించడం హస్యాస్పదం గా ఉందని అన్నారు. . మైదం మహేష్ కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News