Sunday, May 18, 2025

మంత్రి శ్రీధర్‌బాబుపై కేసును కొట్టివేత

- Advertisement -
- Advertisement -

తీర్పు ఇచ్చిన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం
ఇది ప్రజా విజయమన్న మంత్రి శ్రీధర్ బాబు

కాళేశ్వరం భూసేకరణ అంశంపై బాధితుల పక్షాన కాంగ్రెస్ నాయకులు ఎనిమిదేండ్ల క్రితం చేసిన ఆందోళనలపై పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు పెట్టిన కేసును కొట్టేస్తూ నాంపల్లి లోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శనివారం తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, (Minister Sridhar Babu )ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ లతో పాటు అన్నయ్యగౌడ్, శశిభూషన్ కాచె తోపాటు మరో తొమ్మిది మందిపై 2017 సంవత్సరంలో పోలీసులు ఆనాడు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు శనివారం నాడు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు.

ఇది ప్రజా విజయం

కేసు తీర్పు వెలువరించిన అనంతర మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu ) మీడియాతో మాట్లాడుతూ ఈ తీర్పు న్యాయ వ్యవస్థపై మరింత గౌరవాన్ని పెంచిందని తెలిపారు. ఇది ప్రజా విజయంగా, రైతుల విజయంగా ఆయన అభివర్ణించారు. పేద రైతుల ఘోషను ప్రత్యేక న్యాయస్థానం అర్ధం చేసుకుందని తెలిపారు.

కాళేశ్వరంతో ప్రయోజనమేలేదు

కాళేశ్వరం ప్రాజెక్టుతో మా ప్రాంతానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని, కానీ, ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. ఎంతో మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు. అసలు ఆనాటి ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు నిలవలేదు. త్వరలోనే ఈ వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని వివరించారు. ఒక్క చుక్క నీరు ఇవ్వకుండా కాళేశ్వరం పేరిట వేలాది ఎకరాలు భూములను రైతుల నుంచి ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండానే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. అన్నదాతల కడుపు కొట్టి ఆ పార్టీ నేతలు అక్రమంగా సంపాదించుకున్నారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు.

వినతిపత్రాల ఇవ్వడానికి వెళ్తే కేసులు పెట్టారు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రజా విచారణ చేస్తున్న సందర్భంగా స్థానిక రైతుల హక్కులను కాపాడాలని విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చేందుకు అక్కడికి వెళ్తే అధికారం ఉందని మాపై అన్యాయంగా వివిధ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అన్నదాతల తరఫున వారి గొంతుకగా మా మంథని ప్రజల కోసం పోరాటం చేస్తే నాతో పాటు, స్థానిక కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని విచారం వ్యక్తం చేశారు. అసలు అక్కడ లేని వ్యక్తుల పేర్లను కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ లో చేర్చి కొందరు బీఆర్‌ఎస్ నేతలు రాక్షసానందం పొందారని చెప్పారు.

తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే

మనది ప్రజాస్వామ్య దేశం, తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాలి అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కానీ, అధికారం ఉంది కదా అని మాపై ఆనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి మాపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. మేమంతా న్యాయస్థానంపై పూర్తి విశ్వాసం ఉంచి న్యాయపరంగా ఎనిమిది సంవత్సరాల పాటు పోరాటం చేశామని, చివరకూ న్యాయమే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News