ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారి భవిష్యత్తులో దక్షిణ భారతదేశానికి గేమ్ చేంజర్‌గా మారి ఖమ్మం జిల్లా కు వరంగా మారబోతున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. శనివారం ఖమ్మం నగర శివారులో ధంసలాపురం వద్ద ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు, మున్నేరు బ్రిడ్జి పనులను ఆయన తనిఖీ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఆర్‌ఓబి, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులు, ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. ఖమ్మం=దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి, కొత్త ఏడాదిలో ప్రజలకు అందుబాటులో తేవాలని ఆదేశించారు. ఉత్తర, దక్షిణ భారతాన్ని కలుపుతూ కనెక్టింగ్ హైవేగా ఖమ్మానికే కాదు.. తెలంగాణకు గేమ్ చేంజర్‌గా మారుతుందని అన్నారు.
160 కిలోమీటర్ల జాతీయ రహదారి పూర్తికావడం వల్ల గంటన్నర సమయంలో ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్ళవచ్చని అన్నారు. సూర్యాపేట నుంచి విజయవాడ వెళ్లకుండా ఖమ్మం మీదుగా వైజాగ్, గోదావరి జిల్లాలవారు, ఒడిశా వెళ్ళేవారికి ప్రయాణం 150 కిలోమీటర్లు తగ్గుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఇక్కడి వారికి ఈ రోడ్డు ఉపయోగపడుతుందని తెలిపారు. ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే రహదారిగా తయారవుతుందని, రూ.3,500 కోట్లతో ఈ రహదారి నిర్మిస్తున్నామని అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి డిజైన్స్ రూపకల్పనలో జాప్యం కావడం వల్ల ఆలస్యం జరిగిందని అన్నారు. దంసలాపురం ఎగ్జిట్ ప్లాన్‌లో ముందు లేకపోవడం వల్లనే పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ధంసలాపురం ఆరోఓబి నవంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఎగ్జిట్ పనులు తో పాటు మున్నేరు బ్రిడ్జి రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా నవంబర్ నాటికి కావాలన్నారు.
ఆర్.ఓ.బి. నిర్మాణానికి సంబంధించి హైటెన్షన్ విద్యుత్ లైన్స్ తరలింపు, భూసేకరణ వంటి అన్నిపనులు పూర్తి చేశామని, నవంబర్ నాటికి ఒకవైపు రైల్వే బ్రిడ్జి పూర్తి చేసుకుంటే సత్తుపల్లి -జంగారెడ్డిగూడెం వరకు ఉపయోగపడుతుందని అన్నారు. కొత్త సంవత్సరంలో ఖమ్మం=దేవరపల్లి జాతీయ రహదారి పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రావాలని అన్నారు. రైల్వే శాఖను సమన్వయం చేసుకుంటూ ఆర్‌ఒబి త్వరగా పూర్తిచేయాలని అన్నారు. రైల్వే, కెనాల్, మున్నేరుపై రహదారి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకు జాతీయ రహదారికి సర్వీస్ రోడ్లు వేస్తే రైతులకు ఉపయోగ పడుతుందని, దీనికి కావలసిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా వ్యవసాయ ప్రాంతం అధికంగా ఉందని, నాగార్జున్ సాగర్ కాల్వ క్రింద ఆయకట్టు ఉన్నందున 365 రోజుల పాటు హార్వెస్టర్ రాకపోకలు ఉంటాయని, రహదారి వాహనాలకు ఆటంకం కలగకుండా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వర్షాలు తగ్గిన నేపథ్యంలో మున్నేరు బ్రిడ్జితో పాటు ధంసలాపురం ఎగ్జిట్ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి చిన్న, చిన్న సమస్యలు ఉంటే కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమంతరావు, నేషనల్ హైవే పిడి దివ్య, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ యాకోబ్, ఖమ్మం ఆర్‌డిఒ నర్సింహారావు, కార్పొరేటర్లు కమర్తపు మురళి, రావూరికరుణ సైదుబాబు, జిల్లా కాంగ్రెస్ నాయకులు సాదు రమేశ్ రెడ్డి,వ డ్డెబోయిన నర్సింహారావు, బ్రహ్మారెడ్డి, ఏడుకొండలు, అంజిరెడ్డి, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.