Tuesday, July 8, 2025

అన్నదాతలపై కేంద్రం శీతకన్ను

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతాంగానికి మేలు చేసే విధంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఆయిల్ పామ్ సాగురైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం నలుగురు దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో మంత్రి తుమ్మల సంప్రదింపులు జరిపారు. ఆయిల్ పామ్ దిగుమతులపై ప్రస్తుత కస్టమ్స్ డ్యూటీని పెంచాలన్న అంశంపై వ్యవసాయశాఖ మంత్రుల మధ్య చర్చ జరిగింది.

కేంద్రం నిర్ణయంతో రైతులకు అన్యాయం
క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలను తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశీయ మార్కెట్‌లో చౌకగా దిగుమతి ఆయిల్ లభిస్తోందని, దీనివల్ల ఆయిల్ పామ్ ఉత్పత్తి చేస్తున్న దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతునట్లు మంత్రి తుమ్మల దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు గణాంకాలతో వివరించారు. కేంద్ర నిర్ణయం వల్ల మిల్లర్లు, రిఫైనర్లు, రీటైల్ వ్యాపారులకు లాభాలు కలుగుతున్నప్పటికీ రైతులు మాత్రం నష్టాలకు లోనవుతున్నట్లు వెల్లడించారు.

తొమ్మిది రాష్ట్రాలకు లేఖలు
పామ్ అయిల్ దిగుమతి సుంకాల తగ్గింపు వల్ల జరుగుతున్న నష్టాలపై తొమ్మిది రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులకు మంత్రి తుమ్మల లేఖలు రాశారు. వారిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు వ్యక్తిగతంగా ఆయన లేఖలు రాశారు. ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలన్న ఏకైన డిమాండ్‌తో కేంద్రాన్ని కలుసుకోవాలని, రైతుల పక్షాన అందరం గళం వినిపించాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.

మద్దతు ధర రూ.25వేలు
ఆయిల్ పామ్‌కు మినిమమ్ గ్యారంటీ ప్రైస్ (ఎంజిపి) రూ.25వేలుగా నిర్ణయించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల తన లేఖలో ప్రస్తావించారు. గతంలో మాదిరిగా క్రూడ్ పామ్ ఆయిల్ పై దిగుబడి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రైతుల హక్కులు, వారి జీవనోపాధి రక్షణ, దేశీయ ఆయిల్ పామ్ పరిశ్రమ స్థిరత్వం కోసం రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తెద్దామని ఆయన సూచించారు. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో ప్రత్యక్షంగా సమావేశమై దిగుమతి విధానాల్లో మార్పులు చేసేందుకు కేంద్రాన్ని డిమాండ్ చేద్దామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News