Monday, July 7, 2025

రైతులపై బావబామర్దుల కపట ప్రేమ: మంత్రి తుమ్మల

- Advertisement -
- Advertisement -

రైతులపై బావబామర్దుల కపట ప్రేమ
వరి వేస్తే ఉరి అన్నది ఎవరు?
పంట నష్టపరిహారం ఎప్పుడైనా చెల్లించారా?
మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్ రావులను నిలదీసిన మంత్రి తుమ్మల
మన తెలంగాణ / హైదరాబాద్: బిఆర్‌ఎస్ నేతలు, మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్‌రావులు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. వరి వేస్తే ఉరి అన్నది ఎవరు ? పంటనష్ట పరిహారం ఎప్పుడైనా చెల్లించారా? ఆని మంత్రి తుమ్మల ఆదివారం ఒక ప్రకటనలో నిలదీశారు. బావబామర్ధుల తీరు చూస్తే వారు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నట్లు స్పష్టమవుతుందన్నారు. నిరాధారమైన ఆరోపణలతో వారు రైతాంగాన్ని తప్పదోవపట్టించే చర్యలను రైతన్నలు ఎప్పటికీ గుర్తించరని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ మొట్టమొదటి ప్రాధాన్యత అని, దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒకటిన్నర సంవత్సర కాలంలనే కోటి మూడు లక్షల కోట్ల రూపాయలు రైతు సంక్షేమా నికి ఖర్చు చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని ఆయన వివరించారు. తమ ప్రభుత్వంలో రైతులు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు అందుతున్నాయని, పల్లెల్లో సంతోషం వెల్లివిరుస్తుంటే బిఆర్‌ఎస్ నాయకుల కళ్ళల్లో కారం కొట్టినట్లుగా ఉందన్నారు.

నాడు రైతుబంధు లేదు రుణమాఫీ లేదు
ధనిక రాష్ట్రంగా ఉన్న కాలంలో కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు దఫాలుగా, రుణమాఫీ 2018 మొత్తాన్ని ఆఖరి సంవత్సరంలో ఎన్నికల ముందు సగం మందికి చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మంత్రి తుమ్మల ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.21 వేల కోట్లు ఒకేదఫా రుణమాఫీ చేసి 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసిందని తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతు బంధు తో పాటు గత రెండు పంట కాలాలలో రూ.13,500 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామని తెలిపారు. ఇటీవల తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుభరోసా నిధులు జమ చేసిన విషయాన్ని మంత్రి తుమ్మల గుర్తుచేశారు.

పోర్టల్‌లో ఎరువుల నిల్వలు
రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందంటూ అబద్దాలు చెప్పడంలో బిఆర్‌ఎస్ నేతలు ఆరితేరారని, కేంద్ర ప్రభుత్వం పోర్టల్‌లో ఎరువుల నిల్వల వివరాలు చూసుకుని మాట్లాడాలని మంత్రి తుమ్మల సూచించారు. ఆగస్టు మాసానికి సరిపడా ఎరువులను ముందుగానే సరఫరా చేయాలని తాము కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. రానున్న రోజులలో అంటే ఎరువుల వినియోగము అధికంగా ఉండే పంటకాలంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించలేమన్న ఒకే ఒక్క కారణం తో ముందు జాగ్రత్తగా కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను సకాలం లో సరఫరా చేయమని అడుగుతున్నామని వివరించారు.

ఆర్ధిక ఇబ్బందులున్న రైతు ప్రాధాన్యత
రైతులకు సంబంధించిన ప్రతి విషయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఆర్థికపరంగా ఎన్ని సమస్యలున్నప్పటికీ హామీలన్నిటిని నిర్దిష్ట సమయంలోనే అమలు చేస్తూ ముందుకెళ్తున్నట్లు తెలిపారు.

కేంద్ర పథకాల మోకాలడ్డింది ఎవరు
కేంద్ర ప్రభుత్వ పథకాలకు బిఆర్‌ఎస్ ప్రభుత్వ పదేండ్లలో రాష్ట్రం వాటా చెల్లించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా అడ్డుకున్నది ఎవరని మంత్రి తుమ్మల ప్రశ్నించారు. మీరు చేసిన అరకొర రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనమైన చేకూరిందా ? రైతు బంధు డబ్బులను రెండున్నర నెలల లోపు ఎప్పుడైనా ఇచ్చారా ? రైతుబంధు పేరుతో మీరు ఎగొట్టిన పథకాలు ఎన్ని ? గత ఐదు సంవత్సరాలలో పంట నష్టపరిహారం రైతులకు ఎప్పుడైనా చెల్లించారా ? యాంత్రికరణ పథకానికి తూట్లు పొడిచింది మీరు కాదా ? పచ్చి రొట్ట విత్తనాల సబ్సిడీలను కూడా బకాయిలు పెట్టింది మీరు కాదా ? అని మంత్రి తుమ్మల మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్‌రావును నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News