మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన
ఆరోపణలపై సమగ్రదర్యాప్తు జరపాలి-
యావత్ తెలంగాణ సమాజం తరుపున
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి క్షమాపణలు
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తనను వేధించారని మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ (Miss England Milla) చేసిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. మహిళలను గౌరవించి, ఆరాధించే గొప్ప సంస్కృతి కలిగిన తెలంగాణ గడ్డపై మిల్లా మాగీ ఎదుర్కొన్న అనుభవం తనను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆడపిల్ల తండ్రిగా, ఏ మహిళకు ఇలాంటి దురదృష్టకర పరిస్థితి రాకూడదని ఆశించారు. యావత్ తెలంగాణ సమాజం తరుపున మిల్లా మాగీకి హృదయ పూర్వకంగా క్షమాపణ చెబుతున్నట్టు తెలిపారు. ఆమెకు జరిగిన సంఘటన తెలంగాణ స్ఫూర్తిని ప్రతిబింబించదని, అది తెలంగాణ ప్రజల విలువలకు వ్యతిరేకం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మహిళలకు సమాన అవకాశాలు కల్పించడాన్ని సంప్రదాయంగా భావించే తెలంగాణకు, రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మలే నిత్య స్ఫూర్తి ప్రదాతలు అని వ్యాఖ్యానించారు. మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ వేదికలపై జరిగే వేధింపులను ఎదిరించి నిలబడాలంటే అసాధారణ ధైర్యం ఉండాలని, మిల్లా మాగీ చూపిన తెగువ అభినందనీయమని అన్నారు. ఈ భయంకర అనుభవం నుండి ఆమె త్వరలోనే కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మిల్లా మాగి (Miss England Milla) చేసిన ఆరోపణలపై విచారణ జరపకుండా ఆమెనే దోషిగా నిలబెట్టాలనుకుంటున్న ప్రభుత్వ వైఖరిని కెటిఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. సమగ్ర దర్యాప్తు జరిగి మిల్లా మాగీని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.