Saturday, May 10, 2025

సౌందర్య సంబురం

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా ర్యాంప్ వాక్‌కు రెడీ

 నేటి నుంచి 72వ మిస్‌వరల్డ్ (Miss World) పోటీలు
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ
వేడుక తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో
ప్రారంభం అబ్బురపరిచే తెలంగాణ
సాంస్కృతిక, కళా ప్రదర్శన సిఎం రేవంత్
రెడ్డి సూచనలకు అనుగుణంగా విస్తృత
ఏర్పాట్లు హైదరాబాద్ చేరుకున్న 2024
మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 72వ మిస్ వరల్డ్(Miss World) (ఎండబ్లు) ర్యాంప్ వాక్‌కు అంతా రెడీ అయ్యింది. హైదరాబాద్ వేదికగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో పాల్గొనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుందరీమణులు చాలా మంది హైదరాబాద్ చేరుకున్నారు. మూడు వారాల పాటు జరిగి ఈ నెల 31న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలేతో 72వ మిస్ వరల్డ్ (Miss World) పోటీలు ముగుస్తాయి. ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కన్నుల పండువగా సౌందర్యం, సంస్కృతి రెండు కలగలిసిన వేడుకగా ఈ ప్రారంభోత్సవ సంబరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎండబ్లు ఈవెంట్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

సంస్కృతి, సౌందర్యం రెండింటినీ మేళవింపుగా నిర్వహించనున్న ఎండబ్లు 2025 ఉత్సవాలను అత్యంత ఘనంగా ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు. తెలంగాణాకు చెందిన వివిధ రకాల జానపద, గిరిజన, శాస్త్రీయ కళలు, హైదరాబాది దక్కని కళారూపాలను ఈ ఉత్సవాలలో సమ్మిళితం చేసి ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నం జరుగుతోంది. ప్రపంచ దేశాల నుంచి హైదరాబాద్ నగరానికి విచ్చేసే సుందరీమణులను ఆహ్వానించేందుకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ నెల 3 నుంచి 9వరకు కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, కథక్, డప్పులు, బాజాభజంత్రీలు, మంగళ వాయిద్యాలతో కూడిన బృందాలతో స్వాగతం పలికేలా ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలో 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రపంచ సుందరి పోటీలకు విచ్చేస్తున్న సుందరీమణులకు స్వాగతం పలికారు. వారందరూ తెలంగాణ నేల మీద, హైదరాబాదులో కాలిడగానే కుంకుమ తిలకం దిద్ది, హారతులతో వారికి ఘన స్వాగతం పలికారు.

తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో ప్రారంభం

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 10 శనివారం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న ప్రపంచ సుందరి పోటీల ప్రారంభోత్సవ వేడుకలలో తెలంగాణ సంస్కృతి, కళలు ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ ఉత్సవం తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో ప్రారంభమవుతుంది. లోక కవి డాక్టర్ అందెశ్రీ రచించిన ఈ గీతానికి, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా ఈ గీతాన్ని ప్రపంచ సుందరి వేడుకలలో ప్రముఖ గాయకుడు, శిక్షకుడు కొమాండూరి రామాచారి శిష్య బృందం 50 మంది కలిసి ఆలపిస్తారు. అనంతరం కాకతీయుల కాలం నుండి తెలంగాణ శాస్త్రీయ నృత్య రీతిగా ఖ్యాతి గడించిన పేరిణి నాట్య ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనిలో 250 మంది మహిళా కళాకారిణులు పేరిణి లాస్య సంప్రదాయాన్ని అనుసరించి ఈ నృత్యాన్ని ప్రదర్శించబోతున్నారు. దీనికి శ్రీ పేరిణి సందీప్ నృత్య దర్శకత్వం వహించగా, ప్రముఖ సంగీత నిపుణుడు ఫణి నారాయణ స్వరాలు సమకూర్చుతారు. దాదాపు పది నిమిషాల పాటు జరిగే ఈ పేరిణి నాట్యంలో సౌందర్యం, సంస్కృతి, స్త్రీల సాధికారత అంశాలు ప్రధానంగా కన్నులకు కట్టినట్లు ప్రవర్శిస్తారు. దీంతోపాటు కళాకారులు అందరూ కలిసి నక్షత్రం ఆకారంలో, సీతాకోక చిలుక ఆకారాన్ని, అలాగే మిస్ వరల్డ్ లోగో ఆకృతిని కూడా తమ విన్యాసాలలో భాగంగా ప్రదర్శిస్తారు.

తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల మేళవింపు

ఆ తర్వాత ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన సుందరీమణుల పరిచయ కార్యక్రమానికి ప్రారంభ సూచికగా, ఖండాల వారీగా తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనలతో ప్రారంభమవుతాయి. వాటిలో భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన కొమ్ము కోయ కళాకారులు రామకృష్ణ బృందం ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత ఆదిలాబాద్ ప్రాంతం నుంచి గోండు జాతి ప్రజల విశిష్ట కళారూపం గుస్సాడీ కళా ప్రదర్శన కత్లే శ్రీధర్ బృందంతో మరొక ఖండానికి సంబంధించిన సుందరీమణులు వేదికకి పరిచయం అవుతారు.

అలాగే తెలంగాణ జానపద సంప్రదాయానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచే డప్పులు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత అందే భాస్కర్ బృందంతో, తెలంగాణ గిరిజన వైభవానికి ప్రతీకగా నిలిచే బంజారా మహిళల విన్యాసాలు స్వప్న బృందంతో ప్రదర్శిస్తారు. ఆ తర్వాత తెలంగాణ గ్రామీణ పల్లె జీవన ప్రతీకగా నిలిచిన ఒగ్గుడోలు కళా విన్యాసాలు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత చౌదరపల్లి రవి కుమార్ బృందంచే ప్రదర్శితమవుతుంది. ఈ కళారూపాలు అన్నింటి మేళవింపుగా ముగింపు ఉంటుంది.

హైదరాబాద్ చేరుకున్న చెస్ రిపబ్లిక్ 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా

కాగా 2024లో మిస్ వరల్డ్ కిరీట విజేత క్రిస్టినా పిస్కోవా శుక్రవారం హైదరాబాద్‌కి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకి అధికారులు తెలంగాణ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. గతంలో ఆమె ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. ఆ సమయంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ఆమె విచ్చేశారు. అలాగే మిస్ మోన్‌టెనెగ్రో కూడా శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.

దీంతో ఇప్పటికే 95 దేశాల నుంచి సుందరీమణులు విచ్చేయగా వీరితో కలిసి 97కి చేరింది. వీవీఐపీ బ్లాకులు, మీడియా గ్యాలరీ, భద్రత, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. మరికొంత మంది రెండు రోజుల్లో వస్తారని మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. మిస్ వరల్ సంస్థ నుంచి 28 మంది నిర్వహణ ప్రతినిధులు, 17 మంది సహాయకులు విచ్చేశారు. మరికొందరు రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News