ఎర్న్, ఎంపవర్, ఎవాల్వ్ సాధనే మా లక్ష్యమని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం మాదాపూర్‌లోని శిల్పారామంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి బజార్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మిస్ వరల్డ్ పోటీదారులను ఉద్దేశించి మంత్రి సీతక్క ప్రసంగించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించేందుకు మహిళా సంఘాల ద్వారా ఎన్నో రకాల వ్యాపారాలను ఏర్పాటు చేయిస్తున్నామని వెల్లడించారు. మహిళా ప్రగతి సమాజ ప్రగతి అన్న అంబేడ్కర్ ఆశయాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శించడం అభినందనీయమని చెప్పారు. అవి కేవలం చారిత్రక ప్రదేశాలే కావని, కష్టానికి, తెగింపునకు, పోరాటానికి కేంద్రాలని చెప్పుకొచ్చారు.
నాగరిక చరిత్రలో మొదట మాతృస్వామ్య వ్యవస్థ ఉండేదని, కానీ ప్రపంచం మొత్తం పితృస్వామ్య వ్యవస్థలోకి వెళ్ళిందన్నారు. దీనివల్ల మహిళలు తమ ఆర్థిక స్వతంత్రతను కోల్పోయారని అన్నారు. కానీ కాలం మారిందని, అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ పోటీలను 72 ఏళ్ల తర్వాత తెలంగాణ వేదికవ్వడం మార్పుకు సంకేతమన్నారు. అందం అంటే బాహ్య సౌందర్యం కాదని, అందమంటే అంతర్గత శక్తి సామర్థ్యాలు, మేధస్సు, స్వేచ్ఛ భావన, స్థితప్రజ్ఞత అని వివరించారు. మహిళలు కోల్పోయిన ఆర్థిక స్వతంత్రతను, సాధికారతను తిరిగి సాధించేందుకు తెలంగాణలో ఇందిరా మహిళా శక్తి విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. సాధికారత అంటే విద్యకు, ఉపాధికి, ఆర్థిక శక్తికి, సమాన హక్కులకు అవకాశాలు కల్పించడమని, గ్రామీణ పేదరిక మహిళల ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఇందిరా మహిళా శక్తి బజార్ మహిళల కళలు, నైపుణ్యం, కష్టపడే తత్వానికి కలబోతగా నిలుస్తోందన్నారు. సుందరీమణులు, గ్రామీణ శ్రామిక మహిళలు సమానమే అని చాటి చెప్పేందుకు మిస్ వరల్డ్ పోటీ దారులను ఇక్కడికి ఆహ్వానించామన్నారు. ఇది కేవలం ఒక మార్కెట్ కాదని, సామాజిక మార్పుకు ఇది ఒక సంకేతమని అన్నారు. తెలంగాణ మహిళల స్ఫూర్తిని శక్తిని మీలో నింపుకుని ముందుకు తీసుకెళతారని ఆశిస్తున్నానని అన్నారు. తెలంగాణ..జరూర్ ఆనా.. బార్ బార్ ఆనా అంటూ మిస్ వరల్డ్ పోటీదారులకు ధన్యవాదాలు తెలిపారు.