ఓరుగల్లు, ములుగులో నేడు అందగత్తెల సందడి
మిస్ వరల్డ్‌తో వరంగల్ ఖ్యాతి విశ్వవ్యాప్తం
ఓరుగల్లుకు 35 మంది అందాల భామల బృందం
22 మంది అందగత్తెలతో మరో బృందం ములుగు సందర్శన
మన తెలంగాణ/హైదరాబాద్: ఓరుగల్లు (Warangal) అంటేనే తెలంగాణ సంస్కృతి సంప్రదాయం, చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. భవ్య దివ్య నవ్య నగరంగా పేరు గాంచింది. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్యానికి రాజధాని నగరం. రమణీయ శిల్ప సౌందర్యం, అద్భుతమై ఆలయాలు, అలరించే రాజస కట్టడాలు వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం ఇలా ఒకటేంటి అన్నింటా ఓరుగల్లుది ప్రత్యేక స్థానం. నేటికీ ఆనాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచిన వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఒక ఐతిహాసిక దుర్గం.
కాకతీయులు అద్భుతంగా నిర్మించిన వరంగల్ (Warangal) కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా ఎంచుకుంది. ఇంతటి ప్రఖ్యాతి సాధించిన ఆలయాలు, పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలను తనివీ తీరా పరిశీంచేందుకు ప్రపంచ సుందరీమణులు తరలిరావడం వరంగల్ గొప్ప తనం ప్రపంచ నలుమూలలకు ఇప్పుడు చేరుతోంది. (Miss world) మిస్ వరల్డ్- 2025 పోటీదారులు బుధవారం వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం పర్యాటక శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.
ఓరుగల్లుకు 35 మంది అందాల భామల బృందం
ప్రపంచ సుందరీమణుల సందర్శనలో భాగంగా బుధవారం తొలుత 35 మందితో కూడిన అందాల భామల బృందం వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను వీక్షిస్తారు. మరో 22 మంది అందగత్తెలతో కూడిన బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని అక్కడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేరిణి నృత్య ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి హరిత హోటల్లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ప్రతి అంశంలోనూ తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా అధికారుల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
‘తెలంగాణ జరూర్ ఆనా’అనే థీమ్‌తో ప్రభుత్వం అందాల భామలు ప్రాచీన ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అందాలు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా వరంగల్ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. చారిత్రాత్మక ఆలయం వరంగల్ వేయి స్తంభాల గుడి, రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలువబడే చారిత్రాత్మక హిందూ దేవాలయం. తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో ఉంది. ఈ ఆలయం కాకతీయ వంశ రాజుల కళా నైపుణ్యానికి, శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయం శివుడు, విష్ణువు, సూర్యునికి అంకితం చేయబడింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడింది. ఈ ఆలయం తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తోంది.
ఇప్పుడు ప్రపంచ సుందరీమణులను (Miss world) కూడా ఆకట్టుకుంటుంది. అలాగే ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం పలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఈ ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది ఒక అరుదైన ప్రత్యేకత. ఈ ఆలయం రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. శివునికి అంకితం చేయబడింది. రామప్ప ఆలయం కాకతీయ శైలిలో నిర్మించారు. ఇది ఎత్తైన నక్షత్ర ఆకారపు పీఠంపై తూర్పు దిశాభిముఖంగా నిర్మితమై ఉంది.
జులై 25, 2021న, రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు కోసం 255 కట్టడాలు పోటీపడగా, 17 దేశాల ప్రతినిధులు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. యునెస్కో వారసత్వ హోదా సాధించింది. ఇంతటి అద్భుతమైన ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అందాలను తిలకించేందుకు ప్రపంచ అందాల భామలు తరలిరావడం చరిత్రలో కొత్త అధ్యాయనానికి నాంది పలుకుతోంది. వరంగల్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగడం జిల్లా ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు. వీటన్నంటినీ తిలకించే అందాల భామలు మంత్రముగ్ధులు కావడం మాత్రం నిజం. ప్రపంచసుందరీమణుల పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సకల ఏర్పాట్లు చేస్తుంటే, జిల్లా ప్రజానీకం మాత్రం అందాల భామలను చూసేందుకు వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు.