పాలమూరు జిల్లాలో ‘మిస్ వరల్డ్’
సుందరీమణుల హల్చల్ తొలుత
బసవ లింగేశ్వరాలయం సందర్శన
అనంతరం పిల్లలమర్రికి పయనం
లంబాడీ పాటలకు డాన్స్
బతుకమ్మ పాటలకు స్థానిక
మహిళలతో కలిసి అడుగులు
వేసిన అందగత్తెలు
మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు పిల్లలమర్రి వృక్షం ప్రకృతి ఒడిలో 22 దేశాల ప్రపంచ సుందరీమణులు శుక్రవారం సందడి చేశారు. పిల్లలమర్రి అద్భుత దృశ్యం వారిని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సులో బయల్దేరిన సుందరాంగులు సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రి చేరుకున్నారు. వారికి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా ఎస్‌పి డి జానకి సాదర స్వాగతం పలికారు. డప్పులు, వాయిద్యాలతో పూలమాలలు వేసి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఘనంగా ఆహ్వానం పలికారు. ముందుగా ప్రపంచ సుందరీమణులు బస్వ లింగేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ చరిత్రను తెలుసుకున్నారు.
అనంతరం పురావస్తు చరిత్ర ఉన్న మ్యూజియంను సందర్శించారు. ఒక్కొక్క విగ్రహం చరిత్ర ఆనవాళ్ళను పురావస్తు నిపుణుడు శివనాగిరెడ్డి వారికి విపులంగా వివరించడంతో చాలా ఆసక్తిగా ఆలకించారు. అక్కడి నుండి పిల్లలమర్రి మహా వృక్షం వద్దకు చేరుకున్నారు. పిల్లలమర్రి పుట్టుపూర్వోత్తరాలను జిల్లా అటవీ శాఖ అధికారులు వారికి వివరించారు. 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పిల్లలమర్రి వృక్షం ఎంతో ప్రసిద్ధి చెందిన విధానాన్ని వివరించారు. దేశంలోనే 3వ అతిపెద్ద వృక్షంగా పాలమూరు పిల్లలమర్రి పొందిందని వివరించారు. అనంతరం పిల్లలమర్రి చెట్టు కింద ఫొటోలు దిగారు. కొందరు సుందరాంగిణులు పిల్లలమర్రితో సెల్ఫీలు తీసుకున్నారు. అక్కడి నుండి తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడేలా బతుకమ్మలను వీక్షిస్తూ బతుకమ్మ పాటలకు అడుగులు వేసి సంతోషం వ్యక్తం చేశారు.
లంబాడీ పాటలకు డ్యాన్స్ చేసి సందడి చేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఇదిలా ఉండగా పిల్లలమర్రి పర్యటనలో ఉన్న చైనా ప్రపంచ సుందరి డీహైడ్రేషన్ గురికావడంతో ఆమెకు జిల్లా వైద్య బృందం ప్రాథమిక చికిత్స చేసింది. పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు పిల్లలమర్రికి ప్రపంచ సుందరీమణులతో పాటు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంఎల్‌ఎలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పర్ణికా రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వీరంపల్లి శంకర్, సిఎం సోదరుడు, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతి రెడ్డి, మూడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్ధ ఛైర్మన్ నరసింహా రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆనంద గౌడ్, పిసిసి నేత వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.