ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన కెటిఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడితే గొప్పవాడినవుతానని కెటిఆర్ అనుకుంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. సీఎల్పీలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి పైన ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చొబెట్టినా అధికారంలోనే ఉన్నామని కెటిఆర్ పగటికలలు కంటున్నారన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా బుద్ధి తెచ్చుకోకుండా కెటిఆర్ నోటికొచ్చినట్లు
మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది రూపాయల కమీషన్లను దండుకున్నారని ఆయన ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం కమీషన్‌ల వల్ల కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయ్యిందన్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులతో కల్వకుంట్ల కుటుంబంలో ఆందోళన నెలకొందన్నారు. కెటిఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావులు తప్ప బిఆర్‌ఎస్‌లో ఎవరూ మాట్లాడటం లేదన్నారు. సిఎం రేవంత్ రెడ్డి పైన తెలంగాణ ప్రజల్లో ఆదరణ, నమ్మకం పెరుగుతోందని అందుకే కల్వకుంట్ల కుటుంబం ఆందోళనలో ఉందన్నారు.