Saturday, August 16, 2025

బనకచర్ల కోసమే కాళేశ్వరం లేదంటున్న సిఎం: జగదీశ్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

స్వాతంత్య్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు ఆయన గురువు, ఎపి సిఎం చంద్రబాబు ప్రసంగానికి కొసాగింపుగా ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎంఎల్‌ఎ గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గోదావరిలో నీళ్లు లేవని చెప్పకుండా, కాళేశ్వరం లేదని చెప్పడం అంటే కేవలం బనకచర్లకు మద్దతు ప్రకటించడమేనని అన్నారు. కాళేశ్వరం నుంచి 240 టిఎంసిలకు పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పలేదంటే బనకచర్లకు అనుమతిస్తున్నట్లే అని స్పష్టమవుతోందని అన్నారు. బనకచర్ల కట్టి తీరుతామన్న చంద్రబాబుకు అనుకూలంగానే కాళేశ్వరంలో తమకు నీళ్లు అవసరం లేదని అన్నట్లు ఉందని, ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే అన్నారు.

వాస్తవంగా గోదావరిలో మిగులు నీళ్లు లేవని, పక్క రాష్ట్రంలో కట్టే ప్రాజెక్టులకు నిరాకరించాలని, కానీ రేవంత్ మాత్రం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఇక్కడ చదివి వినిపించారని అన్నారు. బనకచర్లకు అనుమతులు రావాలంటే కాళేశ్వరంను రికార్డులో నుంచి మాయం చేయాలనే కుట్ర జరుగుతోందని, చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడారని అన్నారు. కాళేశ్వరంపై ఉన్న నంది మేడారం, కన్నెపల్లి, గాయత్రి పంప్‌హౌస్‌లను ప్రారంభించారంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంతా బాగున్నట్లే అన్నారు. కాళేశ్వరం ద్వారా గత ఎనిమిది పంటలకు నీళ్లు ఇచ్చినట్లుగానే ఈ ప్రభుత్వం ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. ఇక్కడి మంత్రి ఉత్తమ్ దేవాదుల నుంచి నీళ్లు ఇస్తామంటూ కొత్త పాట అందుకున్నారని, దేవాదుల నీళ్లు ఇస్తామన్న ప్రాంతానికే ఇప్పటివరకు ఇవ్వలేదని, ఎస్‌ఆర్‌ఎస్‌పి 40 ఏళ్లు గడిచినా మొత్తం ఆయకట్టుకు ఇప్పటి వరకు నీళ్లు ఇవ్వలేదని, దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెస్తామనేది మోసం అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్‌ను ప్రారంభించి ఈ ప్రాంత రైతాంగానికి నీరు ఇవ్వాలని, కాళేశ్వరంపై కాంగ్రెస్ చెప్పిందంతా అబద్ధమని రుజువైందని అన్నారు. నందిమేడారం పంపు ఆన్ చేస్తే మిడ్ మానేరుకు నీళ్లొచ్చాయని, అలాగే మిగతా పంపులు ఆన్ చేస్తే సూర్యాపేటకు కూడా నీళ్లు వస్తాయని అన్నారు. నాలుగేళ్లుగా సూర్యాపేటకు వచ్చింది కాళేశ్వరం జలాలే అని, ఇప్పుడొచ్చే నీళ్లకు ఏ పేరు పెట్టిన పర్వాలేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లో బనకచర్లను వ్యతిరేకించాలని, ఇప్పుడున్న నీళ్ల మీద ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదన్నారు. ఆయన వెంట బిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News