మనతెలంగాణ/మునుగోడు : లీడర్ అంటే కేవలం రాజకీయమే చేసేవాడు కాదు అభివృద్ధి చేసేవాడే అసలైన లీడర్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎలగల గూడెంలో నూతన గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో విద్యారంగ పరిస్థితులు, నియోజకవర్గ అభివృద్ధి పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి జరుగుతుందనే ఆశతోనే మనల్ని ప్రజలు గెలిస్తున్నారని అన్నారు. పదవులు అనేవి అదనపు అభివృద్ధి కోసమే తప్ప అలంకార ప్రాయానికి కాదని స్పష్టం చేశారు. స్థానిక నాయకులందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదని, సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.
వసతి గృహాలను తనికీ చేసినప్పుడు కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన గ్రామం మన మండం మన నియోజకవర్గం మనమందరం అనే భావనతో అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. 43 క్లస్టర్ పాఠశాలల అభివృద్ధికి, 17 రెసిడెన్షియల్ వసతి గృహాల అభివృద్ధి కోసం స్థానిక నాయకులతో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ వసతి గృహాల సమస్యల పై పలుమార్లు ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా ఎన్నో సమస్యలు వచ్చాయన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఒకటే చేస్తే సరిపోదని, నాయకులందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మరో మారు సూచించారు. అభివృద్ధి కోసం ఎలా నిధులు సమీకరించాలనే దాని పై నియోజకవర్గ నాయకులతో ఈ సందర్భంగా చర్చించారు.
తనవంతుగా మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరుతో నిధులు కేటాయిస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పై నాయకుల అభిప్రాయాలు, ఆలోచనలు సూచనలు తీసుకున్నారు. ఈ సమావేశంలో పలువురు ముఖ్య నాయకులు అభివృద్ధి కోసం తమవంతుగా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. పాత రోజులు వేరు నేటి సమాజం వేరని, మనం చేఏ ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారని, అభివృద్ధి చేసిన వారికే రాజకీయాలలో కొనసాగే పరిస్థితి ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.