Saturday, July 26, 2025

హీరోయిన్ల ఫోన్లను హ్యాక్ చేయిస్తున్నసిఎం రేవంత్: ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీ నేతల ఫోన్లను సిఎం రేవంత్‌రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారని ఆ పార్టీ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. తాము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కెసిఆర్, కెటిఆర్,హరీష్ రావు ఎప్పుడూ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని, కానీ సిఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో చిట్ ఛాట్‌లో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ సాధారణ విషయం అని చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్,బిజెపి నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, తమ పార్టీ అగ్రనేతలు కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడటం తప్ప.. ఒక్క పనికూడా చేయడం లేదని విమర్శించారు.

ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లకు రేవంత్ రెడ్డి హ్యాక్ చేయిస్తున్నారని ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చినవారి ఫోన్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్యాప్ చేసిందని అన్నారు. మై హోం భుజాలో ఏ హీరోయిన్ దగ్గరకు వెళ్లారో కూడా మాకు తెలుసని సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చరిత్ర అంతా తనకు తెలుసు అని పేర్కొన్నారు. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డిపై ఇడి, సిబిఐ విచారణ చేయాలని కోరారు. బ్రోకర్లతో కలిసి సినీ ఇండస్ట్రీలో ఉన్న వారి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. తన ఫోన్ హ్యాక్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని తెలిపారు. తన సతీమణి ఫోన్ కూడా హ్యాక్ చేశారని ఆరోపించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పారని అన్నారు. శుక్రవారం కేబినెట్ మీటింగ్ జరగాల్సి ఉందని..

కానీ తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేందుకు మంత్రులంతా ఢిల్లీకి వెళ్లారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఢిల్లీలో పెద్ద పంచాయతీ జరుగుతుందని ఆరోపించారు. అందుకే కేబినెట్ సమావేశం రద్దు చేసుకుని ఢిల్లీలో పంచాయతీ నడుస్తుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ తేల్చేవరకు కేబినెట్ మీటింగ్‌కు రాము అని మంత్రులు చెప్పారంట అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. కేబినెట్ మీటింగ్ ఎందుకు రద్దు అయిందో సిఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News