గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మోసగించినట్లు తమ ప్రభుత్వం మోసగించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్‌లో ప్రతి రోజూ ప్రజా పాలనలో సమస్యల పరిష్కారం పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం ఇంకా తదితర సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు అందాయన్నారు.
అవసరమైన వాటికి సంబణధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేసినట్లు ఆమె తెలిపారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వాగ్దానాలతో ప్రజలను మోసగించిందని ఆమె విమర్శించారు. తమకు బిఆర్‌ఎస్‌లా ప్రజలను మోసగించడం తెలియదన్నారు. రాజకీయ ఎత్తులు, జిత్తుల వంటివి తాను పట్టించుకోనని ఆమె చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పంచుకోవడమే తన ధ్యేయమని యశస్విని రెడ్డి తెలిపారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల అమలుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.