Monday, July 14, 2025

నేను మామూలు ఆడబిడ్డను కాదు.. అగ్గిరవ్వను: ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

- Advertisement -
- Advertisement -

ఆడబిడ్డలను ఎంతగానో గౌరవించే తెలంగాణలో చట్టసభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి హేయమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, డిజిపి కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఐజీ రమణ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ, చైర్మన్‌కు ఉన్న విచక్షణ అధికారాలను ఉపయోగించి తీన్మార్ మల్లన్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలను శాసన మండలి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని కోరారు.

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోన్న రోజుల్లోనూ పోలీసులు, నాయకుల గన్ మెన్లు ఏ ఒక్క రోజు కాల్పులు జరిపిన దాఖలాలు లేవని అన్నారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయానికి వెళ్లారని తెలిపారు. వాళ్లు దాడి చేస్తేనే తమ వాళ్లు ప్రతిదాడి చేశారని.. ఇంతమాత్రానికే గన్ ఫైర్ చేస్తారా..? అని ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా..? అని నిలదీశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోనని తేల్చిచెప్పారు. తాను మామూలు ఆడబిడ్డను కాదు.. అగ్గిరవ్వను అని హెచ్చరించారు.

సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలి
సిఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారని.. తనపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసినా సిఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్నపై సిఎం చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాఖ్యలు వెనుక ఆయన ఉన్నారని భావించాల్సి వస్తుందన్నారు. సిఎం,డిజిపి వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎంఎల్‌సినైనా తనపై చేసిన వ్యాఖ్యలనే పట్టించుకోకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటన్నారు. తాను ఏడాదిన్నరగా బిసిల కోసం ఉద్యమిస్తున్నానని.. ఏ ఒక్కరోజు కూడా తాను తీన్మార్ మల్లన్నను ఒక్కమాట కూడా అనలేదని చెప్పారు. అలాంటప్పుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

తీన్మార్ మల్లన్న బిసి కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందని అనుకోవడం సరికాదన్నారు. తెలంగాణ జాగృతి కార్యకర్తల ఘటన వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. జాగృతి కార్యకర్తలపై తుపాకులతో కాల్పులు జరిపించింది తీన్మార్ మల్లన్ననా.. లేక ప్రభుత్వమా..? అనేది తెలియాలన్నారు. ఇంత పెద్ద ఘటనపై ఫిర్యాదు చేయడానికి వస్తే డిజిపి కార్యాలయానికి డిజిపి రాకపోవడం వెనుక ప్రభుత్వమే ఉందన్న అనుమానం కలుగుతుందన్నారు. తీన్మార్ మల్లన్న ఆదేశాలతోనే గన్‌మెన్ కాల్పులు జరిపారని.. గన్ మెన్లను వెంటనే డిస్మిస్ చేయాలని ఎంఎల్‌సి కవిత డమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News