హైదరాబాద్: కాళేశ్వరంలో చిన్న భాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్లు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఆదివారం అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రి ఉత్తమ్‌కుమార్ ప్రవేశపెట్టగా.. దానికి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత సిఎం రేవంత్ బిఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో కవిత ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘‘ఎవరి వల్ల, ఎందుకోసం కెసిఆర్‌కు అవినీతి మరక అంటింది. కెసిఆర్ పక్కనున్న కొందరు చేసిన పని వల్ల ఆయనకు చెడ్డపేరు. ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు పాత్ర లేదా. హరీశ్‌రావు, సంతోష్, మేఘా ఇంజినీరింగ్ వల్లే కెసిఆర్‌కు అవినీతి మరక. హరీశ్‌రావు పాత్ర ఉన్నందునే రెండోసారి మంత్రివర్గంలోకి తీసుకోలేదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో హరీశ్‌రావు, సంతోష్ కుమ్మక్కు అయ్యారు.’’ అని ఆరోపించారు.
కెసిఆర్ జనం కోసం పని చేస్తే.. హరీశ్‌రావు, సంతోష్‌లు సొంత ఆస్తుల పెంపు కోసం పని చేశారని కవిత అన్నారు. ‘‘హరీశ్‌రావు, సంతోష్‌లు నాపై ఎన్నోసార్లు కుట్రలు చేశారు. నాపై ఎన్ని కుట్రలు చేసినా.. ఏం మాట్లాడినా.. నోరు మెదపలేదు. ఈరోజు కెసిఆర్ బిడ్డగా నేను ఎంతో బాధపడుతున్న. హరీశ్‌రావు, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు, సంతోష్‌ల మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది. హరీశ్‌రావు, సంతోష్‌ను రేవంత్ ఏమీ అనరు.. నా తండ్రిపైనే బాణం వేస్తారు.’’ అని కవిత అన్నారు.
Also Read : కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరిగిన మాట వాస్తవం కాదా?: మహేష్ గౌడ్
కెసిఆర్ మీద సిబిఐ దర్యాప్తు వేశాక పార్టీ ఉంటే ఏమిటీ.. లేకపోతే ఏంటి అని కవిత (MLC Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా తండ్రి దాకా వచ్చాక ఇంకా పార్టీ ఏంటి. ఇది నా తండ్రి పరువుకు సంబంధించింది. నా లేఖ బయటకు వచ్చినా.. నేను ఎవరి పేర్లు బయటపెట్టలేదు. ఈ వయస్సులో కెసిఆర్ సిబిఐ విచారణ ఎందుకు ఎదురుకోవాలి. హరీశ్‌రావు, సంతోష్ నాపై ఎన్ని కుట్రలు చేసినా భరించాను. నాపై వ్యక్తిగతంగా దాడులు చేసినా వాళ్ల పేర్లు ఎప్పుడూ చెప్పలేదు. కెసిఆర్‌పై సిబిఐ విచారణకు కారణం హరీశ్‌రావు, సంతోష్. నా మాటల వల్ల బిఆర్ఎస్ శ్రేణులకు కోపం రావొచ్చు. అప్పుడప్పుడూ వాస్తవాలు మాట్లాడుకుని మందు తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది’’ అని కవిత పేర్కొన్నారు.
కెసిఆర్ ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నా ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేదని కవిత తెలిపారు. ‘‘డబ్బులపై కెసిఆర్‌కు ఏనాడు ఆశ లేదు. కాళేశ్వరంలో పని చేసిన ముగ్గురు ఇంజినీర్ల వద్ద వందల కోట్ల సంపద ఉంది. కాళేశ్వరం ఇంజినీర్ల ఆస్తులపై ఎందుకు విచారణ జరిపించట్లేదు. ఎసిబికి చిక్కిన ఇంజినీర్ల వెనుక ఎవరున్నారో ఎందుకు విచారణ చేయట్లేదు. హరీశ్‌రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉండి కాపాడుతున్నారు. బిఆర్ఎస్‌ను ఇబ్బందులకు గురి చేసిన అవినీతి అనకొండలను ఏమీ అనట్లేదు. వాళ్ల సోషల్‌మీడియా బ్యాచ్ రేపట్నుంచి నాపై దుష్ప్రచారం చేస్తారు’’ అని కవిత తెలిపారు.