Thursday, August 21, 2025

కక్ష కట్టి టిబిజికెఎస్ నుంచి తొలగించారు.. కవిత సంచలన లేఖ

- Advertisement -
- Advertisement -

కార్మిక చట్టాలకు విరుద్దంగా గౌరవాధ్యక్షుని ఎన్నిక
రాజకీయ కారణాలతోనే తనను ప్రక్కన పెట్టారు 
సింగరేణిలో చక్కర్లు కొడుతున్న కవిత సంచలన లేఖ
మనతెలంగాణ/యైటింక్లయిన్‌కాలనీ: తనపై కక్ష కట్టి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి తొలగించారని కల్వకుంట్ల కవిత విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. కుమారుని అడ్మిషన్ నిమిత్తం అమెరికాకు వెళ్లిన కవిత అక్కడి నుంచే లేఖను విలేకరులకు పంపించారు. రెండు రోజుల క్రితం హైద్రాబాద్‌లోని తెలంగాణభవన్‌లో జరిగిన టిబిజికెఎస్ కేంద్ర కమిటి సమావేశంలో కవితను గౌరవాధ్యక్షురాలిగా తొలగించి కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు. దీన్ని ఉటంకిస్తూ కవిత విడుదల చేసిన లేఖ సింగరేణి వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. టిబిజికెఎస్‌కు గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు కార్మికుల కుటుంబాల్లో ఒక సభ్యురాలుగా సేవలందించానని, కార్మికులను ఏకత్రాటిపైకి తీసుకొచ్చానని పేర్కోన్నారు. టిబిజికెఎస్‌లో జరిగే నిర్ణయాలను గౌరవ అధ్యక్షురాలి హక్షదాలో తీసుకునేలా తీర్మానం చేశారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల సంక్షేమానికై పోరాడుతుంటే కొందరు కుట్రలు, కక్షలు పన్ని తొలగించడం దారుణమన్నారు. కార్మిక చట్టాలకు విరుద్దంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించడం తప్పో, ఒప్పో అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతో ఎన్నిక జరిగినట్టుగా అవగతమవుతుందన్నారు. దీని వల్ల తనకు వ్యక్తిగతంలో ఎలాంటి నష్టం లేకున్నా కార్మికుల శ్రేయస్సుకై పోరాడుతున్న తనను లక్షంగా చేసుకొని తొలగించారన్నారు. రెండు దశాబ్దాల పాటు ప్రక్కన పెట్టిన డిపెండెంట్ ఉద్యోగాలను కెసిఆర్‌ను ఒప్పించి కారుణ్య నియామకాల పేరుతో 19,463 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కోన్నారు. సకల జనుల సమ్మెతో సింగరేణిలో ఒక్క బొగ్గు పెళ్లను సైతం బయటకు రాకుండా చేసి ఢిల్లీ పాలకులకు కనువిప్పు కలిగించామన్నారు.

తెలంగాణ ఇంక్రిమెంట్ ఇప్పించామన్నారు. పది లక్షలకు వడ్డీ లేకుండా ఇంటి రుణం, ఉచిత కరెంటు, ఉచిత ఏసి, మ్యాచింగ్ గ్రాంటు పది రెట్లు, ఐఐటి, ఐఐఎం చదివే వారి పిల్లలకు ఫీజు రియింబర్స్‌మెంట్, అంబేద్కర్ జయంతి రోజున పిహెచ్‌డి, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్‌లకు ఆఫ్షనల్ హలీడే, కార్మిక కుటుంబసభ్యులకు కార్పోరేట్ వైద్యం లాంటి వాటి అమలులో క్రీయాశీలకంగా పనిచేశానన్నారు. బిఆర్‌ఎస్‌లో కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలు, తన తండ్రికి వ్రాసిన లేఖను అమెరికా పర్యటనలో ఉండగా లీక్ చేయడంతో మనస్థాపానికి గురైనట్టు చెప్పారు. దీన్ని బయటపెట్టాలని కోరితే తనపై కక్ష కట్టారన్నారు. అట్టి కుట్రదారులే వివిధ రూపాల్లో వేదింపులకు గురి చేస్తున్నారన్నారు. మళ్లి అమెరికాలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్దంగా టిబిజికెఎస్ కేంద్ర కమిటి సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షున్ని ఎన్నుకున్నట్టు ప్రకటించారన్నారు. టిబిజికెఎస్‌కు గౌరవాధ్యక్షురాలి హోదాలో ఉన్నా లేకున్నా కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. గతంలో ఎలా పనిచేశానో అదే రీతిలో కార్మికులకు చిన్న కష్టం వచ్చినా అండదండగా ఉంటానన్నారు.

లేఖ రెండు అంశాలను ప్రస్తావించని కవిత..
కవిత వ్రాసిన సుదీర్ఘ లేఖలో ఇటీవల జరిగిన పరిణామాలను ప్రస్తావించలేదని పలువురు కార్మికులు చర్చించుకుంటున్నారు. కవిత టిబిజికెఎస్ గౌరవాధ్యక్షురాలి హోదాలో ఉన్న సమయంలోనే, కవిత వ్రాసిన లేఖ లీకు అయిన కొద్ది రోజులకే సింగరేణిలోని 11 ఏరియాలకు సింగరేణి జాగృతి పేరుతో ఇంచార్జిలను నియమించారు. తెలంగాణ భవన్‌లో కెటిఆర్‌తో టిబిజికెఎస్ సమావేశం జరిగినా కవితను గౌరవాధ్యక్షురాలి హోదా నుంచి తొలగించలేదు. కానీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మాత్రం సింగరేణి టిబిజికెఎస్‌కు ఇంచార్జిగా ప్రకటించారు. ఇది జరిగిన తరువాత 15 రోజుల క్రితం కవిత హైద్రాబాద్‌లోని బంజారాహిల్స్ తన స్వంత గృహంలో హెచ్‌ఎంఎస్ నాయకత్వంతో సమావేశం నిర్వహించి పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించారు. జాతీయ స్థాయి హోదా కలిగిన హెచ్‌ఎంఎస్‌తో కలిసి సింగరేణిలో పోరాటాలు చేస్తామని మీడియాతో తెలిపారు. హెచ్‌ఎంఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్టు స్వయంగా కవిత ప్రకటించిన తరువాతనే రెండు రోజుల క్రితం టిబిజికెఎస్ కేంద్ర కమిటి సమావేశం నిర్వహించి ఈశ్వర్‌ను గౌరవాధ్యక్షునిగా నియమించారు. కవిత వ్రాసిన లేఖలో సింగరేణి జాగృతితో ఇంచార్జిల నియామకం, హెచ్‌ఎంఎస్‌తో పొత్తు పెట్టుకున్న విషయాలను మాత్రం అందులో ఉటంకించలేదు. ఎందుకు ఇంచార్జిలను నియమించాల్సి వచ్చింది, హెచ్‌ఎంఎస్‌తో ఎందుకు పొత్తు పెట్టుకుంది పేర్కోనక పోవడంపై సింగరేణిలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ రెండింటికి వివరణ ఇస్తే బాగుండేదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News