Sunday, September 7, 2025

ఉరుమురిమి హరీశ్‌పైనా?

- Advertisement -
- Advertisement -

గణపతి నవరాత్రుల చివరిరోజున ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గణపతి హోమం నిర్వహించినట్టు ప్రచారం జరిగింది. ప్రచారం అనడానికి కారణం యజ్ఞాలు, పూజలు తరచూ పెద్దయెత్తున నిర్వహించే కెసిఆర్ మీడియాను కూడా ఆహ్వానించి వార్తలు రాసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి అనుమతించేవారు. ఈసారి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం దరిదాపుల్లోకి కూడా వారిని రానివ్వలేదు. సామాజిక మాధ్యమాల పరిస్థితి తెలుసు కదా, కెసిఆర్ చండీయాగం చేస్తున్నారని, ఇంకేదో పెద్ద వ్రతం చేస్తున్నారని ప్రచారం చేసేశాయి. ఇంతాచేస్తే ఆయన జరిపింది గణపతి హోమం అని తేలింది. విఘ్నాలు తొలగించమని గణనాథుడిని కోరుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఆయనకు చాలా ఉంది.

దాదాపు రెండేళ్ల క్రితం అధికారం కోల్పోయాక కేసీఆర్ బయటికి రావడం చాలా తగ్గిపోయింది. కొన్ని సందర్భాలలో మాత్రమే ఆయన పబ్లిక్‌లోకి రావడం, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాలో చోటుచేసుకోవడం కనిపిస్తోంది. పార్టీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లాలో జరిపిన బహిరంగసభ తర్వాత దాదాపుగా ఆయన ఎవరికీ దర్శనం ఇవ్వలేదు. ఆ సభ తర్వాతే భారత రాష్ట్ర సమితిలో లుకలుకలు మరింత బయటపడుతూ వచ్చాయి. ఆయన కుమార్తె, మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆ సభ జరిగిన తీరు, జనం స్పందన మీద తండ్రికి రాసిన లేఖ లీక్ కావడం నుంచి బిఆర్‌ఎస్ లో అంతర్గతంగా నాయకుల మధ్య ఏర్పడిన పొరపొచ్చాలు బహిర్గతం కావడం, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానించడం, ఆ వెనువెంటనే కవిత కాళేశ్వరం అవినీతి అంతా హరీశ్ రావు, సంతోష్ రావుల నిర్వాకమేననీ, తన తండ్రి కెసిఆర్ అమాయకుడని బహిరంగ ప్రకటన చేయడం, దాంతో కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ

ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేయడం, దానికి స్పందనగా కవిత పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి, శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. తొలుత పార్టీ కార్యాధ్యక్షుడు, అన్న కేటీ రామారావును వారసుడిగా నియమించేందుకు తండ్రి చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటిస్తున్న అభిప్రాయం కలిగించిన కవిత హఠాత్తుగా హరీశ్ రావు మీద పడ్డారు. కాళేశ్వరం అవినీతి ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ రావు చేసిందే తప్ప కెసిఆర్‌కు ఏ పాపం తెలియదన్నారు. అన్న, తండ్రి మీద నుండి కోపం బావ మీదికి మరల్చడమే కాకుండా ఆయన నుండి తండ్రిని, పార్టీని కాపాడమని ఆమె అన్నకు విన్నవించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. రాజకీయాల్లో కెసిఆర్ వ్యవహారశైలిని దగ్గరగా చూసిన వారంతా కవిత మాటలకు ముక్కున వేలేసుకున్నారు. భారత రాష్ట్ర సమితిలో, ఆ పార్టీ ఏలుబడిలో కేసీఆర్‌కు తెలియకుండా చీమ చిటుక్కుమనడానికి కూడా వీలు లేదన్నది బహిరంగ రహస్యం.

ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం వ్యవహారంలో సిబిఐ విచారణ కోరుతూ బంతిని కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టిన సమయంలో అవినీతి జరిగిన మాట నిజమేనని, అయితే అది చేసింది తన తండ్రి కాదు బావ అని కవిత తేల్చేసినట్టయింది. ఆ వ్యవహారం మీద ఆరా తీయడానికి సిబిఐ డైరెక్టర్ హైదరాబాద్ వచ్చి ఇక్కడి జోన్ అధికారులతో చర్చలు జరిపినట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో కేంద్రం నిజంగానే సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఖచ్చితంగా కవితను సాక్ష్యం చెప్పడానికి పిలవక తప్పదు.ఇక భారత రాష్ట్ర సమితిలో బయటపడ్డ కుటుంబ కలహానికి కాంగ్రెస్ కారణమని, భారతీయ జనతా పార్టీ కారణమని ఎవరు ఎంత నమ్మించ చూసినా జరగబోయే నష్ట నివారణ మాత్రం సాధ్యం కాదు. రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన పార్టీగా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీగా, చంద్రశేఖరరావు వంటి బలమైన నాయకుడు నేతృత్వం వహిస్తున్న ప్రాంతీయ శక్తిగా తన స్థానాన్ని పదిలపరుచుకున్న బిఆర్‌ఎస్‌ను రాజకీయ చిత్రపటంనుంచి అదృశ్యం

చేయాలన్న కోరిక ప్రత్యర్థి రాజకీయ పక్షాల్లో ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే పనిగట్టుకుని కవితను రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ రెచ్చగొట్టి ఉంటారన్న వాదనలో పెద్ద పసలేదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు నుండే, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాకముందు నుండే, చంద్రశేఖరరావు కుటుంబంలో నాలుగు స్తంభాల రాజకీయ ఆట నడుస్తున్న విషయం తెలిసిందే.మొత్తం మీద కవిత వ్యవహారంలో ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. బిఆర్‌ఎస్ అధినేతకు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మరి కొంచెం ముందుకుపోయి కెసిఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలోనే కీలక రాజకీయ నాయకుడిగా అవతరిస్తారని, అది జరగకుండా చూడడానికి జరుగుతున్న కుట్ర వెనక చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఉన్నారని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ పార్టీ పేరు మార్చి ఢిల్లీలో ఆఫీస్ తెరిచి హడావుడి చేసిన కేసీఆర్ పార్టీ ఆ తరువాత జరిగిన

లోకసభ ఎన్నికల్లో బోణీ కూడా చెయ్యలేకపోవడం చూసాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సమర్థించే ఒక టీవీ ఛానల్ అయితే ఏకంగా కవిత తెలుగుదేశంలో చేరతారని, ఆమె ముఖ్యమంత్రి కూడా అవుతారని జోస్యం చెప్పేసింది. చంద్రబాబును వెంటబెట్టుకుని వస్తే తెలంగాణలో తమకు ఉన్న ఈ కాస్త బలం, పలుకుబడి కూడా సున్నా అవుతాయని కమలనాథులకు బాగా తెలుసు. కవిత తెలుగుదేశంలో చేరినట్టయితే, తెలంగాణలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటూ కొద్ది రోజులు తిరిగిన రాయలసీమ బిడ్డ షర్మిల వలెనే కవితకు కూడా శృంగభంగం తప్పదు. సరే కాంగ్రెస్, బిజెపి పార్టీలు అయితే కవితను తాము చేర్చుకునేది లేదన్నాయి.ఇంతకూ కవిత పోరాటం ఎవరిమీద? కాళేశ్వరం కడుతున్నంతసేపు, అక్కడ ఆమె చెప్తున్న అవినీతి జరుగుతున్నంత సేపు ఆమె ఆ పార్టీలోనే ఉన్నారు. ఆమె చెబుతున్న సామాజిక తెలంగాణ అంశం పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో ఆమె ఏ వేదికలపైన అయినా ప్రస్తావించారా? దాని కోసం పోరాటం చేశారా? అన్న విషయం ఆమె చెప్పాలి.

కవిత భవిష్యత్తు కార్యాచరణ ఏమిటన్నది ఇప్పుడు చర్చ. ఆమె ఇంకే పార్టీలోనైనా చేరతారా లేక సొంతంగా పార్టీ పెట్టుకుంటారా, పెట్టుకుని తట్టుకొని నిలబడగలరా అన్న విషయాలపై చర్చించాలి. తెలంగాణలో ఒక కొత్త ప్రాంతీయ పార్టీ నిలిచి గెలిచే పరిస్థితి ఉందా? కవిత కొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించవచ్చనే ఊహాగానాలు విపరీతంగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ ప్రశ్న తలెత్తుతున్నాయి.
జాతీయ సరళి
కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడతాయని చరిత్ర చెపుతున్నది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అందుకు పెద్ద ఉదాహరణ. అక్కడ కాంగ్రెస్ బలం క్షీణించడంతో, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్ పి), బహుజన్ సమాజ్ పార్టీ (బీయస్‌పీ) ఆ శూన్యాన్ని భర్తీ చేశాయి. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ఆవిర్భావం కాంగ్రెస్ పతనం అవుతున్న క్రమంలోనే జరిగింది. మహారాష్ట్రలో శరద్‌పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) కాంగ్రెస్ నుండి విడిపోయి దాని బలాన్ని లాగేసింది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (టీఏంసీ). కాంగ్రెస్ వదిలిపెట్టిన శూన్యతను భర్తీ చేసింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగయింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నిర్వాకం తెలిసిందే. జగన్‌మోహన్ రెడ్డిని చేజేతులా దూరం చేసుకున్న ఫలితంగా వరుసగా మూడు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి.

మరోవైపు కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలలో ప్రాంతీయ ప్రత్యామ్నాయాలు విజయవంతం అయిన సందర్బాలు చాలా అరుదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో జాతీయ పక్షాలైన కాంగ్రెస్-, బిజెపి ప్రధానమైన ప్రాంతీయ రాజకీయ శక్తులను నిరోధించాయి. కర్ణాటకలో జనతాదళ్ (లౌకిక) ఉంది కానీ దాని పరిమిత పరిధి కాంగ్రెస్‌ను ఎప్పుడూ స్థానభ్రంశం చేయలేకపోయింది. దక్షిణాది కూడా ఇలాంటి కథనే చెబుతుంది. తమిళనాడులో కాంగ్రెస్, బీజేపీలు ద్రవిడ పార్టీలకు తోకలుగా మారిపోయాయి. బలమయిన డిఎంకె, ఎఐఎడిఎంకెను ఢీకొట్టెందుకు ప్రముఖ నటుడు విజయ్ పార్టీ రూపంలో మరో ప్రాంతీయ పక్షం ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో 2014 విభజన తర్వాత కాంగ్రెస్ కూలిపోయింది. అక్కడ మరో జాతీయపక్షం బిజెపి.. టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పాటు కావలసిన పరిస్థితి. ఈ కూటమిని బలంగా ఢీ కొంటున్న మరో ప్రాంతీయ శక్తి వైయస్‌ఆర్‌సిపి.

తెలుగు సందర్భం
అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను విజయవంతంగా సవాలు చేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం (టిడిపి). ఇంకా చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. ఎంతో సినిమా గ్లామర్ ఉన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ చివరికి కాంగ్రెస్‌లో విలీనం అయింది. అలాగే మరికొన్ని విఫల ప్రయత్నాలూ జరిగాయి. 2014 లో విభజన తర్వాత తెలంగాణ కథ వేరు. ఇక్కడ కెసిఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (అప్పటి టిఆర్‌ఎస్) మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా దాదాపు దశాబ్దంపాటు ఆధిపత్యం చెలాయించింది. కొన్ని కొత్త ప్రాంతీయ ప్రయోగాలు ఫలించలేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి బొక్కబోర్లా పడ్డారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యింది. తెలంగాణ ఉద్యమానికి, దానిని ముందుండి నడిపించిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఊపిరిగా నిలిచిన తెలంగాణ జెఎసి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ జనసమితి పేరిట ఒక విఫల ప్రయోగం చేశారు.

తెలంగాణ టుడే
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి పుంజుకుని, 2023లో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే ఆ పార్టీ పని అయిపోయిందని సంతోషపడుతున్నవాళ్లు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఓటరు మూడు నాలుగేళ్ల ముందే ఫలానా పార్టీని ఓడించాలని, ఇంకో పార్టీని గెలిపించాలని నిర్ణయించుకోడు. అప్పటి పరిస్థితుల మీద ఆధారపడే ఎన్నికలలో జయాపజయాలు ఉంటాయి. ఇక బిజెపి తెలంగాణలో బలోపేతం కావడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయా? ఎంతోకాలంగా కలలు కంటున్న అధికారం అందుతుందా? అన్న విషయం బీఆర్‌ఎస్ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బీఆర్‌ఎస్‌లో కవిత ఎపిసోడ్ తరువాత నెలకొన్న పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు వార్తలోచ్చాయి. తమకు వెన్నతోపెట్టిన విద్య అయిన పార్టీ ఫిరాయింపులను ఉధృతం చేసేందుకు పూనుకోబోతున్నారని కూడా ప్రచారం బలంగానే సాగుతున్నది.
2023 లో బీఆర్‌ఎస్ ఓడిపోయినప్పటికీ,

ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటికీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగానే ఉంది. అయితే గత రెండేళ్ల వలె కాకుండా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి చెమటోడిస్తే తప్ప అది సాధ్యం కాదు. ఇక్కడో విషయం ప్రస్తావించాలి. తెలంగాణలో మలి దశ రాష్ట్ర సాధన ఉద్యమం కోసం టీఆర్‌ఎస్ ఏర్పడటానికి ఒక ఏడాది ముందే 2000 సంవత్సరంలో ఏర్పడిన జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్క జార్ఖండ్‌లోని జెఏంఏం తప్ప మిగతా రెండు చోట్లా ఉద్యమ సంస్థలు కనుమరుగు అయ్యాయి. తెలంగాణలో మాత్రమే రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పైబడినా ఫక్తు రాజకీయపార్టీగా మారి నిలదొక్కుకున్న పేరు బీఆర్‌ఎస్ కే దక్కింది. ఈ పరిస్థితుల్లో కవిత ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతున్న మరో ప్రాంతీయ పార్టీకి చోటు తెలంగాణలో పరిమితంగానే కనిపిస్తోంది. స్పష్టమైన సైద్ధాంతిక వేదిక, ప్రజాబలం, ఆర్థిక వనరులు లేదా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండింటికీ వ్యతిరేకంగా బలమైన గాలి లేకుండా ఆమె కొత్త పార్టీ పెట్టినా ఇప్పటికే విఫల ప్రయోగాలు చేసిన కొన్ని ప్రాంతీయ పక్షాల జాబితాలో చేరిపోయే ప్రమాదం ఉంది.

బాటమ్ లైన్
చరిత్ర ఒక నిదర్శనమనుకుంటే ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పతనమైనట్లు కాకుండా, తెలంగాణలో ఇప్పటికీ బలమైన అధికార కాంగ్రెస్, రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం చేసిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బలోపేతానికి శక్తియుక్తులు ఒడ్డుతున్న బీజెపీ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో, కవిత పార్టీ పెడితే రాజకీయ దృశ్యాన్ని పునర్నిర్మించడానికి బదులుగా మహా అయితే ఓట్లను చీల్చడానికి ఉపయోగపడుతుందేమో.

amar devulapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News