Sunday, August 3, 2025

లిల్లీఫుట్ నేత నాపై మాట్లాడతారా?.. జగదీష్ రెడ్డిపై కవిత సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ లేకుంటే నల్గొండ లిల్లీపుట్ ఎవరు..?
ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బిఆర్‌ఎస్ సోదరులు మాట్లాడలేదు
నాపై కుట్ర చేస్తుంది బిఆర్‌ఎస్‌లోని పెద్ద నాయకుడే
72 గంటల దీక్షకు ధర్నాకు అనుమతి రాకపోతే నా నివాసం నుంచైనా దీక్ష కొనసాగిస్తా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు
ఎంఎల్‌సి కవిత వ్యాఖ్యలకు జగదీష్ కౌంటర్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌లోని పెద్ద నాయకులే తనపై అనుచిత వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ఇంటి ఆడబిడ్డ మీద వ్యాఖ్యలు చేస్తే బిఆర్‌ఎస్ నాయకులు ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో ఒక్కటి మినహా అన్ని సీట్ల ఓటమికి కారణమైన లిల్లీఫుడ్ నేత తన గురించి మాట్లాడుతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ లేకుండా ఆ లిల్లీఫుట్ ఎవరు…? అని ప్రశ్నించారు. కెసిఆర్ లేకపోతే బిఆర్‌ఎస్‌లో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు… ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కెసిఆరే కదా..? అని అడిగారు. ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడగానే నిన్న మొన్న బిఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చిన చిన్న పిల్లగాడు కూడా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఎవరు మీరు.. తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వచ్చి పదవులు పొంది తన మీదనే మాట్లాడుతరా? అని నిలదీశారు. బిజెపి ఎంపి సిఎం రమేష్ వ్యాఖ్యలకు, తన లేఖ లీక్ అయ్యేందుకు, బిఆర్‌ఎస్‌లోని ఇతర పరిణామాలకు సంబంధం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

తనపైన వ్యాఖ్యల వెనక ఓ బిఆర్‌ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉందని, అందుకే బిఆర్‌ఎస్ నాయకులెవరూ స్పందించలేదని తాను బలంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఆ కుట్ర చేసిన పెద్ద నాయకులు తన దగ్గర ఎవరో పది మందిని పెట్టి తన దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారని, కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావల్సింది ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు సమాచారం వస్తనే ఉంటదని చెప్పారు. ఆయన ఎవరిని ఏ టైంలో కలిసారు…తరపై వ్యాఖ్యలు చేయటానికి ఎవరిని ప్రోత్సహించారు. ఆయన ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారో తాను గమనిస్తున్నానని పేర్కొన్నారు. తాను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. ఇప్పుడు తనను ఏదో ఒంటరి చేసి తన మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయించి శునకానందం పొందొచ్చు అని, కచ్చితంగా అది తిరిగి కొట్టే సమయం వస్తదని చెప్పారు. తాను భయపడే వ్యక్తిని కాదు అని, తెలంగాణ కోసమే కొట్లాడానని అన్నారు.

కాంగ్రెస్, బిజెపి పార్టీల నాటకాలు
బిసి రిజర్వేషన్ల సాధన కోసం సోమవారం నుంచి ఇందిరాపార్క్ వద్ద 72 గంటల దీక్ష చేసేందుకు ప్రభుత్వాన్ని అనుమతి అడిగితే స్పందన లేదని ఎంఎల్‌సి కవిత అన్నారు. బిసి బిల్లు అంశంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు నాటకాలాడుతున్నాయని ఆమె విమర్శించారు. రాష్ట్రపతి దగ్గరున్న బిల్లు విషయంలో సిఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. సోమవారం తలపెట్టే ధర్నాకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోతే తన నివాసం నుంచైనా దీక్ష కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు. గాంధేయ మార్గంలో అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా 72 గంటలు దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, బిజెపి కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేతలు ఎవరూ బిసి రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లేదని తెలిపారు.

కెసిఆర్ శత్రువుల వ్యాఖ్యలను కవిత వల్లె వేశారు: జగదీష్‌రెడ్డి
కెసిఆర్‌కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు, బిఆర్‌ఎస్‌ను ఖతం చేయాలని చూస్తున్న వారు ఏం మాట్లాడుతున్నారో.. కవిత అదే మాట్లాడుతున్నారని విమర్శించారు. కెసిఆర్ శత్రువులు ఉపయోగించిన పదాలను కవిత వల్లె వేస్తున్నారని ఆక్షేపించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అంటూ ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో 25 ఏళ్లల్లో జరిగిన ఉద్యమాలు, గెలుపునకు తాను బాధ్యుడను అయితే ఓటమికి కూడా తానే బాధ్యుడిని అని పేర్కొన్నారు. పార్టీ అంతిమంగా ఫైనల్ అని, తాను పార్టీకి సైనికుడిని అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తులుగా ఏదో చేస్తామని అంటే వారి భ్రమ అని ఎద్దేవా చేశారు. కొంతమంది ఏదో చేయాలని ఊహించుకుంటున్నారని విమర్శించారు.

తాను కెసిఆర్‌ను ఈ మధ్య కాలంలో తాను 50సార్లు కలిశానని, కెసిఆర్‌తో బనకచర్ల, కాళేశ్వరం నీళ్లు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపైనే చర్చించామని స్పష్టత ఇచ్చారు. కెసిఆర్ జరిగిన సమావేశంలో నిమిషం సమయం కూడా కవిత గురించి చర్చించలేదని తాను చెప్పానని పేర్కొన్నారు. కెసిఆర్ లేకపోతే ఎవరూ లేరని, అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చిచెప్పారు. తాను చావు తప్పి కన్నులొట్ట బోయినట్లు ఎంఎల్‌ఎగా గెలిచానని.. కానీ కొంతమంది గెలవలేదు కదా..? అని ప్రశ్నించారు. కవితపై ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని చెప్పారు. తన దృష్టికి వచ్చి ఉంటే స్పందించేవాడినని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News