మనతెలంగాణ/హైదరాబాద్: 25 వేల మంది బిసిలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పునరుద్ఘాంటించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో యుపిఎఫ్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీని అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఇప్పటివరకు రాజకీయంగా ఎలాంటి అవకాశం దక్కని కులాలకు రాజకీయ రిజర్వేషన్ల ఫలాలు దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని.. అది కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ కేబినెట్ చేసిన సవరణ తీర్మానం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందని, దానికి వెంటనే ఆమోదముద్ర వేసి గెజిట్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కేవియట్ వేయకుంటే ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లకు అడ్డు తగిలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికి అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రిజర్వేషన్లను పెంచుతూ చట్ట సవరణ చేసే అధికారం కేంద్రం పరిధిలో ఉంటే.. ఉన్న రిజర్వేషన్లలో సబ్ కేటగిరైజేషన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవియెట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇస్తే.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేధిస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.