Wednesday, September 17, 2025

తీన్మార్ మరో పెరియార్ అవుతాడు

- Advertisement -
- Advertisement -

దగ్గర్లోనే బిసిల తలరాత మార్చే రోజు
పార్టీలన్నీ సంపదను దోచుకుంటున్నాయి
మాజీ డిజిపి, ఏఐబిఎస్పీ జాతీయ సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు

మన తెలంగాణ / హైదరాబాద్: : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయపార్టీని ప్రారంభించారు. తన పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టిఆర్‌పి)ని ఏర్పాటుచేశారు. తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహించిన సభా కార్యక్రమంలో పలువురు బిసి ప్రముఖల సమక్షంలో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తీన్మార్ మల్లన్న పార్టీ జెండాను రెండు రంగులతో ప్రత్యేకంగా రూపొందించారు. జెండాపై ’ఆత్మగౌరవం, అధికారం, వాటా’ అనే నినాదాన్ని కూడా ముద్రించారు. కాషాయం, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న జెండాపై రెండు కంకుల మధ్య కార్మిక చక్రంలో పిడికిలి గుర్తు ఉంది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టిఆర్‌పి విధి విధానాలు, పార్టీ జెండా ప్రాధాన్యతను సభకు వివరించారు. ఈ సమావేశానికి రిటైర్డ్ డిజిపి, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ(ఎఐబిఎస్పీ) జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె.పూర్ణచంద్రరావు, ప్రొఫెసర్ మురళీ మనోహర్, విజిఆర్ నారగోని తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న మరో పెరియార్
స్థాపించిన కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం ఒక సంచలనమని, తమిళనాట పెరియార్ తరహాలో సంచలనాత్మక రాజకీయాలు చేస్తారని రిటైర్డ్ డిజిపి, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ(ఎఐబిఎస్పీ) జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె.పూర్ణచంద్రరావు అన్నారు. బుధవారం తాజ్ కృష్ణ హోటల్‌లో తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టిఆర్‌పి) ఆవిర్భావ సభలో ఆయన పాల్గొన్నారు. టిఆర్‌పి పార్టీ జెండా ఆవిష్కరించి విధి విధానాలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సభకు వివరించారు. ప్రొఫెసర్ మురళీ మనోహర్, విజిఆర్ నారగోనితో పాటు పలువురు ప్రముఖులు పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం, బ్రాహ్మణవాదం, అగ్రకుల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ద్రావిడ కళగాన్ని పెరియార్ ఎనబై ఏళ్ల క్రింత ప్రారంభించారని, దాని నుంచే డిఎంకె, అన్నా డిఎంకె పార్టీలు పుట్టాయని తెలిపారు. ఈ పార్టీల నేతృత్వంలో బిసిల ఏలుబడిలో తమిళనాడులో పాలన జరుగుతుందన్నారు. అందుకే తమిళనాట ఆపార్టీల నేతృత్వంలో బిసిల ఏలుబడిలో సమర్ధవంతమైన పరిపాలన జరుగుతుందన్నారు. బిసిల నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంలో అన్ని కులాలకు ప్రాతినిధ్యం లభించిందని తెలిపారు. తమిళనాట పెరియార్ సృష్టించిన సంచలనాత్మక రాజకీయాలను తీన్మార్ మల్లన్న తెలంగాణలో తీసుకువస్తారన్న విశ్వాసం తనకెంతో ఉందన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రంలో స్థితిగతులను మారుస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. ఏ ఒక్కరినీ తక్కువగా చూడడంలేదని, అదే తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే కేవలం వందకు ఐదుగురు మాత్రమే ఉన్న కులాల వారే పాలకులుగా ఉన్నారని వివరించారు. మనం ఎవ్వరికీ వ్యతిరేకం కాదంటే రాజకీయం నడవదు, 95 శాతం ఉన్న ప్రజానీకం ఏకం కావాల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక పార్టీ మరొక పార్టీకి వ్యతిరేకం, ఒకరినొకరు యుద్దం చేసుకుంటూ సంక్షేమం, అభివృద్ధి పేరుతో రాష్ట్ర సంపదను దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. మన దేశానికి అసలైన సమస్య కుల పెత్తందారీతనమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే మనం ఎవరి మీద పోరాటం చేస్తున్నామో అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పగలగాలి, చెప్పే ధైర్యం మన తీన్మార్ మల్లన్నకు ఉంది అని ఆయన వెల్లడించారు.

Also Read: నిరుద్యోగుల సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News