Friday, July 18, 2025

అధికారాన్ని కొనసాగించేందుకు గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్: తీన్మార్ మల్లన్న

- Advertisement -
- Advertisement -

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కొనసాగించేందుక ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) ఆరోపించారు. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎదుట గురువారం తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మల్లన్న మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు అనేక మంది ఫోన్లను గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని, చివరకు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతున్నందుకే తన రెండు ఫోన్లు ట్యాప్ చేసినట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌తో నిరంతరం తనపై నిఘా ఉంచారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు అందజేశానని, మరికొంత సమాచారం ఉందని, అది త్వరలోనే అధికారులకు పంపిస్తానని ఆయన తెలిపారు. అవసరం అయితే మళ్లీ పిలుస్తామని అధికారులు చెప్పారన్నారు. అధికారాన్ని కొనసాగించేందుకు గత ప్రభుత్వం చేసిన అన్ని దుర్మార్గాల్లో ఫోన్ ట్యాపింగ్ అతి పెద్ద దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు.

వ్యక్తిగత హక్కులను హరించిన కెసిఆర్ కుటుంబం, బాధ్యులయిన అధికారులపై చర్యల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. సిఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో భాధితుడేనని ఆయన గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలు ఈ ప్రభుత్వంలో జరగవనే సంకేతాలు ప్రజలకు ముఖ్యమంత్రి ఇవ్వాలన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ అరాచకం బయటపడిందని లేకపోతే ఇప్పటికీ కొనసాగేదేనని మల్లన్న ఆరోపించారు. సామాన్యుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సామాన్యులను మావోయిస్టులుగా ముద్ర వేసి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని కెసిఆర్‌తో పాటు ఈ నేరానికి పాల్పడిన వారందరిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ముందుగానే సిట్ ను బద్నాం చేయడం ఎందుకని, ఈ కేసు విచారణ సిబిఐకి అప్పగించాలని అప్పుడే కోరమని, సిట్ ఏ మేరకు న్యాయం చేయగలదో వేచి చూస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News