న్యూఢిల్లీ: ఆదివారం అనూహ్య రీతిలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా వేర్వేరుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతో సమావేశం అయ్యారు. ఓ వైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం తిరిగి ఆరంభమవుతున్న దశలో ఈ భేటీలపై ఆసక్తి నెలకొంది. వెంట వెంటనే గంటల వ్యవధిలో వీరు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లడం, ఎక్కువసేపే చర్చించడం వెనుక కారణాలు వెంటనే వెల్లడికాలేదు. ప్రధాని కార్యాలయం నుంచి కానీ, హోం మంత్రి ఆఫీసు నుంచి కానీ ఈ భేటీ గురించి ఎటువంటి సమాచారం వెలువడలేదు. అయితే రాష్ట్రపతి భవన్ నుంచి ఎక్స్ సామాజిక మాధ్యమ వేదిక ద్వారా వీరి సమావేశం గురించి తెలిసింది. ముందుగా సాయంత్రం పూట వెలువడిన సమాచారంలో ప్రధాని మోడీ వచ్చి రాష్ట్రపతిని కలిశారని ప్రకటించారు. గంటల తరువాత హోం మంత్రి అమిత్ షా రాష్ట్రపతితో సమావేశం అయ్యారని వివరణలు వెలువడ్డాయి. విదేశీ పర్యటనల తరువాత ప్రధాని మోడీ రాష్ట్రపతిని కలుసుకోవడం ఇదే మొదటిసారి.
అమెరికా పాతిక సుంకాల విధింపు తరువాత ప్రధాని మోడీ హుటాహుటిన రాష్ట్రపతిని కలుసుకోవడం కూడా ఇదే తొలిసారి. రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా, తరువాత ఈ పదవికి ఎన్నిక ప్రక్రియ కూడా కీలక అంశాలుగా మారాయి. బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ సర్‌పై పార్లమెంట్‌లో తీవ్ర ప్రతిష్టంభన సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తోంది. జులై 21వ తేదీన వర్షాకాల సెషన్ ఆరంభం తరువాత చిన్న చిన్న బిల్లులు ప్రతిపక్షాల నిరసనల మధ్య ఆమోదం పొందాయి. సిందూర్, పహల్గాం దాడులపై రెండు సభలలో సుదీర్ఘ చర్చ ప్రభుత్వ సమాధానం, విపక్షాల ఘాటైన విమర్శల పర్వం సాగింది. ఇక మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపుపై లోక్‌సభ ఆమోదం లభించింది.
రాజ్యసభలో దీనిపై చర్చ జరగాల్సి ఉంది. ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక సెప్టెంబర్ 9వ తేదీన జరుగుతుందని పేర్కొంటూ ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటన వెలువరించింది. ఈ కీలక పదవికి ఎన్నిక అంశం కూడా ప్రధాని మోడీ, అమిత్ షాలు రాష్ట్రపతి వద్ద ప్రస్తావనకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. విదేశీ పర్యటన తరువాత రాష్ట్రపతిని ప్రధాని మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగి ఉంటుందని కొన్ని వర్గాలు తెలిపాయి. అయితే కొన్ని కీలక కారణాలతోనే రాష్ట్రపతితో మోడీ, అమిత్ షాలు భేటీ అయి ఉంటారని, ఇది ఈ సోమవారం నుంచి ఆరంభం అయ్యే పార్లమెంట్ సెషన్ క్రమంలో వెల్లడి అవుతుందని మరికొన్ని వర్గాలు విశ్లేషించాయి.