ఢిల్లీ: సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం ఇది అని ప్రదాని నరేంద్ర మోడీ తెలిపారు. కోట్ల మంది త్యాగాలతో స్వాతంత్య్రం వచ్చిందని, 140 కోట్ల మంది సంకల్ప పండుగ ఇది అని పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి మోడీ ప్రసంగించారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే సమయం అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ హీరోలకు తాను సెల్యూట్ చేస్తున్నానని, మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారని, పహల్గామ్‌లో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామన్నారు. భార్య ముందే భర్తను చంపేశారని, పిల్లల ముందే తండ్రిని చంపేశారని పాక్ ఉగ్రవాదులు మతాన్ని అడిగి మరీ మారణహోమం సృష్టించారని ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామని తెలియజేశారు. మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.. పాక్‌లోకి చొచ్చుకెళ్లి మరీ మన జవాన్లు ముష్కరులను మట్టుబెట్టారని, మన సైన్యం ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిందని ప్రశంసించారు. ఉగ్రవాదులను, వారికి మద్ధతిచ్చేవారిని తాము వేర్వేరుగా చూడటంలేదని ఘాటుగా స్పందించారు.
అణుబాంబు బెదిరింపులను సహించేదిలేదని, ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, ఇకపై ఎవరి బ్లాక్‌మెయిల్ నడవదని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే ధీటుగా జవాబిస్తామని హెచ్చరించారు. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందని, లక్ష్యాన్ని చేరే సమయాన్ని కూడా సైన్యమే నిర్దేశిస్తోందని మోడీ వివరించారు. మళ్లీ చెబుతున్నా నీరు, రక్తం కలిసి ప్రవహించే ప్రసక్తే లేదని, సింధూ జలాల ఒప్పందంపై మరో మాట లేదని, సింధూ జలాలను భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదని పిఎం స్పష్టం చేశారు. నీటి కొతర ఉన్న ప్రాంతాలకు సింధూ జలాలు తరలిస్తామని, సింధు జలాలపై సంపూర్ణాధికారం భారత్‌ది అని, భారత్ రైతులదని, సింధూ జలాల ఒప్పందం పునరుద్ధరణ ఇక ఎప్పటికీ జరగదన్నారు.
‘ఆత్మనిర్భర్ భారత్ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి, ఇది టెక్నాలజీ శతాబ్దం, సెమీకండక్టర్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తున్నాం, ఇప్పటికే 4 ఇండస్ట్రీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాం, సౌర విద్యుత్ సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాం, జల విద్యుత్ ప్రాజెక్టులు పెంచాం, అణువిద్యుత్‌లో ప్రైవేట్ సెక్టార్‌ను ఆహ్వానించాం, సముంద్రంలో చమురు వెలికితీతకు యత్నిస్తున్నాం, అంతరిక్ష రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, అంతరిక్ష రంగంలో 300కు పైగా స్టార్టప్‌లు వచ్చాయి, ప్రపంచానికి ఫార్మా క్యాపిటల్‌గా భారత్‌కు పేరు ఉంది, వ్యాక్సిన్ల తయారీలో సత్తా చాటుతున్నాం’ అని ప్రధాని మోడీ తెలియజేశారు.
సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వైపు దేశ యువత దృష్టిపెట్టాలని, విదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై మనం ఎందుకు ఆధారపడాలని అని ప్రశ్నించారు. యువ ఇంజినీర్లు, అధికారులకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. వినూత్న ఆలోచనలతో యువత ముందుకు రావాలని, యంగ్ టాలెంట్‌కు అండగా ఉంటానని మోడీ భరోసా ఇచ్సారు. మేడిన్ ఇండియా ఫైటర్ జెట్ ఇంజిన్లు తయారు చేయాలని, భూమికి నష్టం కలగకుండా ఫెర్టిలైజర్లు తయారు చేద్దామని, ఎలక్ట్రికల్ వాహనాలకు అవసరమయ్యే అన్ని పరికరాలను మనమే తయారు చేసుకుందామని, స్వదేశీ మంత్రంతో సమృద్ధి భారత్‌కు అడుగులు వేద్దామని, భారత్ వస్తువులనే కొనుగోలు చేసి ఉపయోగిద్దామని ప్రధాని పిలుపునిచ్చారు.