కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలం, గుల్ల తండాలో శనివారం తెల్లవారుజామున విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. గుల్ల తండాకు చెందిన చవాన్ శంకాబాయి (36), ఆమె కుమార్తె చవాన్ శివాని (14) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గాలి కోసం కూలర్ పెట్టుకున్నారు. ప్రమాదవశాత్తు నిద్రలో శివాని కాలు కూలర్ నీటిలో పడటంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. పక్కనే ఉన్న తల్లికి సైతం విద్యుత్ ప్రవహించడంతో ఆమె కూడా మృతి చెందింది. వారి కుమారుడు ప్రతీక్ బయట పడుకోవడంతో బతికిపోయాడు. తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా, తల్లి, చెల్లెలు మృత్యువాత పడటంతో విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలిపాడు.
విద్యుత్‌ను నిలిపివేశారు. కుటుంబ పెద్ద అయిన చవాన్ ప్రహ్లాద్ డ్రైవర్‌గా పని చేస్తుండటంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, మరో కూతురు బంధువుల వద్దకు వెళ్లింది. ప్రమాదం జరిగిన విషయాన్ని తండావాసులు పోలీసులకు తెలిపారు. బిచ్కుంద సిఐ జగడం నరేష్, ఎస్‌ఐ భువనేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. రాత్రి సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకేసారి విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.