పేగుబంధానికి తలవంపులు తెచ్చే ఘటన ఇది. నవ మాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లి మానవత్వం మరిచి కర్కశంగా వ్యవహరింది. 80 రోజుల పసికందును బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన మెదక్ జిల్లా, దుబ్బాక మండలం, అప్పనపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకోగా.. పసికందు మృతదేహాన్ని గురువారం వెలికితీశారు. ఇంటి ముందు ఆడిస్తున్న పసికందును ఇద్దరు దుండగులు అపహరించారని కన్నతల్లి పోలీసులను తప్పుదోవ పట్టించింది. చివరికి విచారణలో తానే తన కన్న కొడుకును బావిలో వేసి చంపినట్లు అంగీకరించడంతో శుక్రవారం పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. దుబ్బాక సిఐ పాలెపు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్ మండలం, పుల్లూరు గ్రామానికి చెందిన రామగళ్ళ శ్రీమాన్.. నంగునూరు మండలం, నర్మెట్టకు చెందిన కవితను మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొని పుల్లూరులోనే నివాసం ఉంటున్నారు. శ్రీమాన్ ఇటీవల రెండు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రావడంతో గ్రామంలో పరువు పోయిందని, అతని అమ్మమ్మ ఊరైన అప్పనపల్లిలో గత రెండు నెలలు నుంచి ఉంటున్నారు.
ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్న జీవితం ప్రశ్నార్థకంగా మారడంతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తరచూ వేధింపులకు గురిచేస్తుండటం, ఆర్థిక ఇబ్బందులు, భర్త ప్రవర్తన, వ్యవహార శైలి నచ్చని ఆమె భర్తతో విడిపోవడానికి సిద్ధపడింది. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న పసికందును తప్పిస్తే.. భర్తను విడిచిపెట్టి హాయిగా ఉండొచ్చని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికందు దీక్షిత్ కుమార్‌ను తీసుకెళ్లి గ్రామశివారులో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో విసిరేసి వెళ్లిపోయింది. తన దగ్గర నుంచి ఇద్దరు ముసుగు వేసుకొని వచ్చిన దుండగులు బాబును ఎత్తుకెళ్లారని చెప్పి, అందరినీ తప్పుదోవ పట్టిస్తూ కిడ్నాప్ జరిగినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె చెబుతున్న విషయాలకు, జరిగిన ఘటనకు పొంతన లేకపోవడంతో తమదైన శైలిలో విచారించారు. భర్త నుంచి విడిపోయి దూరంగా వెళ్లిపోవాలని, అడ్డుగా ఉన్న కుమారుడిని తానే బావిలో వేసి చంపినట్లు అంగీకరించింది. దీంతో ఆమె భర్త శ్రీమాన్ ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు కవితను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.