చెన్నై: తమిళ స్టార్ కమెడియన్ సంతానం (Santhanam) అటు కామెడీ పాత్రలు చేస్తూనే.. ఇటు హీరోగా కూడా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలా అతను హీరోగా చేసిన సినిమాల్లో మంచి సక్సెస్ తెచ్చిపెట్టింది ‘దిల్లుకు దుడ్డు(డిడి)’ సినిమాల సిరీస్. హారర్ కామెడీ జానర్‌లో రూపొందిన ఈ సినిమాల సిరీస్‌లో అన్ని సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఆ సిరీస్‌లో మరో సినిమా వస్తోంది. అదే ‘డిడి నెక్ట్స్ లెవల్’(DD Next Level). ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఆఫ్రో సంగీతం అందించారు. ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. సెల్వరాఘన్, నిజల్గల్ రవి, రెడ్డిన్ కింగ్ల్సీ, తదితురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే విడుదలకు ముందే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నుంచి ‘గోవింద గోవింద’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. దీంతో హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతిని కించపరిచేలా ఈ పాట రూపొందించారని.. భక్తులు, హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చిత్ర యూనిట్ ఈ పాటని తొలగిస్తున్నామని శుక్రవారం ప్రకటించింది. పాటను తొలగించిన తర్వాతే సెన్సార్ సర్టిఫికేట్ తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు.