Thursday, July 24, 2025

బండి ,ఈటల వివాదం చిన్నదే:ఎంపి అరవింద్

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తమ పార్టీ ఎంపి ఈటల రాజేందర్ మధ్య తలెత్తిన వివాదం చాలా చిన్నదేనని బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ అన్నారు. ఏ పార్టీలోనైనా గొడవలు సహాజమేనని ఆయన తేలిగ్గా తీసేశారు. బుధవారం ఢిల్లీలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావుకు, స్వయాన సోదరి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు మధ్య వివాదం లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు లేవా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా ఎలా మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నామని అన్నారు.

రాజకీయ పార్టీల్లో అంతర్గత విబేధాలు సహజమేనని ఆయన తేలిగ్గా చెప్పారు. తమ పార్టీలో కూడా మంత్రి బండి సంజయ్‌కి ఎంపి ఈటలకు మధ్య తలెత్తిన వివాదం చాలా చిన్నదేనని అన్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు కల్పించుకుని పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, మాజీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కలిసి బండి సంజయ్, ఈటల రాజేందర్‌ను సమావేశపరిచి చర్చించి పరిష్కరించాలని ఆయన సూచించారు. అవసరమైతే పార్టీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలని ఆయన సూచించారు. జాతీయ నాయకత్వం నోడల్ ఎంక్వైయిరీ కమిషన్‌ను నియమించాలని ఎంపి అరవింద్ సూచించారు.

రాజా సింగ్ మా వాడే..
పార్టీ నుంచి సస్పెన్షకు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తమ పార్టీ వారేనని ఆయన తెలిపారు. తమ పార్టీలో సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది కాబట్టి రాజా సింగ్ కూడా ఒక మిస్డ్ కాల్ ఇస్తే తమ పార్టీలో ఉన్నట్లేనని అన్నారు. కొన్ని కారణాల చేత రాజాసింగ్ బిజెపికి రాజీనామా చేశారే తప్ప ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని ఆయన వివరించారు. తమ పార్టీ ఎంపిలకు ఒక్కొక్కరికి రెండేసి లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని ఆయన పార్టీ జాతీయ నాయకత్వానికి సూచించారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే కీలకమని అరవింద్ చెబుతూ పార్టీలో కార్యకర్తలు ఇక నాయకులు అయ్యే సమయం ఆసన్నమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తలు నాయకులుగా మారే ఎన్నికలేనని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి కార్యకర్తలను నాయకులుగా మార్చేందుకు పార్టీలో నాయకులు, కార్యకర్తలూ కృషి చేయాల్సి ఉందన్నారు. ఇందూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఈ దఫా తమ పార్టీ దక్కించుకుంటుందని అరవింద్ ధీమాగా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News