బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళలో వేర్వేరు పార్టీల నుంచి అరవై మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. అప్పుడు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా ఎందుకు చేయించలేదని ఎంపి కిరణ్‌కుమార్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి కెటిఆర్‌కు అప్పుడు తెలియదా? అని అన్నారు. హైదరాబాద్‌లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్ తరపున గెలుపొందినా, పార్లమెంటు ఎన్నికల్లో సున్నా వచ్చిందన్నారు.
కంటోన్మెంట్‌లో మూడో స్థానంలో బిఆర్‌ఎస్ నిలిచిందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కనుగొన్నట్లు మాజీ మంత్రి కెటిఆర్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్ హయాంలో నాలుగు ఫ్లైవోవర్లు, దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి తప్ప సాధించింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని కెటిఆర్ ప్రకటించగలరా? అని ఆయన ప్రశ్నించారు.