కెసిఆర్ కుటుంబంలో ఉన్న ఆ ఐదుగురు కలిసి తెలంగాణను దోచుకున్నారని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. హరీశ్, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ ఎట్లా అవుతుందని ఎంఎల్‌సి కవిత చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎంఎల్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి తో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. గొర్రెల పథకం, దళిత బంధు స్కాంలు.. ఇసుక దందా, రియల్ ఎస్టేట్, గ్రానైట్ వ్యాపారాలతో గత ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసిందని విమర్శించారు.
కవిత బిఆర్‌ఎస్ నుంచి బయటికి వచ్చి గతంలో జరిగిన అవినీతిపై మాట్లాడి మంచి పనిచేసిందని అన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై కవిత సిబిఐకి వాగ్మూలం ఇచ్చి తమ చిత్తశుద్ధిని నిరుపించుకోవాలని సూచించారు. జరుగుతున్న దోపిడీని చూసి ఊరుకున్న కెసిఆర్ కూడా అవినీతిపరుడేనని అన్నారు. దోపిడీ జరిగిన విషయాన్ని తెలిసినా కెసిఆర్ అప్పుడే దోపిడీని ఎందుకు అపలేదని ప్రశ్నించారు. గత పాలనలో జరిగిన అవినీతికి కెసిఆర్ కుటుంబం బాధ్యత వహించవలసిందేనని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనలో నీతిమంతమైన, సుస్థిర పాలన అందిస్తున్నామని చెప్పారు.