మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః గతంలో గంజికి కూడా స్థోమత లేని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు బెంజ్ కారులో ఎలా తిరుగుతున్నారని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళలో, జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా తన నియోజకవర్గం గురించి మాట్లాడారా? అని చామల మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పిదాలను ఇప్పుడు తమ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
బిజెపి రథసారధిగా పాతకళాకారుని స్థానంలో కొత్త కళాకారుడు వచ్చాడని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ కార్డులపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫొటో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో ఫేజ్2పై ప్రధాని మోదీ ఫొటో పెడతామని ఆయన చెప్పారు. బ్రిటీష్ కాలంలోనే మైనారిటీ ముస్లింలను బిసిల్లో చేర్చారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని ఎంపి చామల అన్నారు.