బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి రాలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి రావడం లేదని కిరణ్‌కుమార్ రెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని, మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని అన్నారని ఆయన చెబుతూ హరీష్ చేసే ఏకాభిపాత్రాభినయాన్ని తప్పకుండా చూపిస్తామని వ్యంగ్యంగా అన్నారు. పదేళ్ళ బిఆర్‌ఎస్ పాలన, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు. నీటి పారుదల ప్రాజెక్టుల కోసమే కాదు నీళ్ళు, నిధులు, నియామకాలపై చర్చకు సిద్ధమని చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్పప్పుడు నీళ్ళు, నిధులు నియామకాల హామీని తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు.
పదేళ్ళ పాలనలో బిఆర్‌ఎస్ నేతలు చిత్తశుద్ధితో పని చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో పడేది కాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ బిఆర్‌ఎస్ హయంలో అప్పుల ఊబిలోకి ఎందుకు వెళ్ళిందని ఆయన ప్రశ్నించారు. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంశాన్ని లేవదీసి ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టాలని పిచ్చి ఆలోచనలతో బిఆర్‌ఎస్ నేతలు ఉన్నారని ఆయన విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాక ముందే 22 కోట్ల రూపాయల వాణిజ్య ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేసుకుందని ఆయన విమర్శించారు. 299 టిఎంసిల నీటిని కాపాడుకుంటామని ప్రజలకు భరోసా కల్పిద్దామని ఆయన హరీష్ రావునుద్ధేశించి అన్నారు. నాడు నీళ్ళ విషయంలో ఆంధ్ర ప్రాంతం నాయకులు అన్యాయం చేస్తే, బిఆర్‌ఎస్ ద్రోహం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణకు 968, ఆంధ్రకు 511 టిఎంసిల వాటా కేటాయించారని ఆయన తెలిపారు.