తనతో బీఆర్‌ఎస్ విలీనం గురించి మాట్లాడలేదని కేటీఆర్ చెప్పగలడా
కేటీఆర్ తనని కలిశారో లేదో ఆయనే చెప్పాలి
మీరైతే ఢిల్లీలో లిక్కర్ వ్యాపారాలు చేసుకోవచా
ఇతరులెవరూ తెలంగాణలో కాంట్రాక్ట్ లు చేయకూడదా
జగన్ మెప్పు కోసమే అప్పుడు కేటీఆర్ నిరసనలకు వ్యతిరేకంగా మాట్లాడారు
బీఆర్‌ఎస్ విలీనంపై మరిన్ని సంచలనాలు ఉన్నాయంటున్న ఎంపీ సీఎం రమేష్
మన తెలంగాణ / అమరావతి : కవిత జైలులో ఉన్నప్పుడు ఢిల్లీ వచ్చిన కేటీఆర్ తనని కలిశారో లేదో ఆయనే చెప్పాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సవాల్ విసిరారు. కావాలంటే తాను సీసీ కెమెరాల వీడియోలన్నీ బయటపెడతానని, తనను కలవలేదని, తనతో బీఆర్‌ఎస్ విలీనం గురించి మాట్లాడలేదని కేటీఆర్ చెప్పగలడా అని అడిగారు. ఈ విషయంపై ఎక్కడ చర్చించడానికైనా తాను సిద్ధమేనని సీఎం రమేష్ వెల్లడించారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము ఇబ్బందుల్లో ఉన్నామని, మా నాన్న ఆరోగ్యం బాగోలేదేని, మదన పడిపోతున్నారని..నువ్వు సాయం చెయ్యి…లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ వచ్చేలా చూడు…అవసరమైతే బీజేపీలో బీఆర్‌ఎస్ ని విలీనం చేస్తాం…లేదా తెలంగాణలో బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటుందని కేటీఆర్ తనతో మాట్లాడిన మాటలు ఇవేనంటూ సీఎం రమేష్ కుండబద్దలు కొట్టారు. లిక్కర్ స్కామ్ లో కవిత జైలులో ఉన్న సమయంలో ఆయన బీజేపీతో మంతనాలు జరిపేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగానే తనను కలిశారని చెప్పారు. అయితే బీజేపీ అధిష్టానం ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని తెలంగాణలో సొంతంగా ఎదుగుతామని చెప్పిందన్నారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ మునిగిపోయే నావ అని, ప్రజలు బీఆర్‌ఎస్ నేతల నిజస్వరూపం తెలుసుకుని వారిని ఓడించారని, ఇకపై కూడా ప్రజలు ఆ పార్టీని నమ్మరనేది బీజేపీ అధిష్టానం అభిప్రాయం అని సీఎం రమేష్ చెప్పారు బీజేపీలో బీఆర్‌ఎస్ ని విలీనం చేసేందుకు తనతో రాయబారం నడిపే ప్రయత్నం చేశారంటూ కేటీఆర్ గురించి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోలేదని, మరికొన్ని సంచలనాలు మిగిలే ఉన్నాయని సీఎం రమేష్ చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటపెడతానని, తరువాత ఎపిసోడ్స్ మిగిలే ఉన్నాయని సీఎం రమేష్ హింట్ ఇచ్చారు.
మీకో న్యాయం.. ఇతరులకో న్యాయమా? : మీరైతే ఢిల్లీలో లిక్కర్ వ్యాపారాలు చేసుకోవచ్చా, ఇతరులెవరూ తెలంగాణలో కాంట్రాక్ట్ లు చేయకూడదా అని సీఎం రమేష్ సూటిగా ప్రశ్నించారు. 9 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కాంట్రాక్ట్ లన్నీ ఏ ప్రాంతం వారికి ఇచ్చిందో అందరికీ తెలుసన్నారు. అమెరికాలో బీఆర్‌ఎస్ సభలు పెట్టుకోవచ్చు కానీ, హైదరాబాద్ లో చంద్రబాబు అరెస్ట్ కి వ్యతిరేకంగా నిరసనలు తెలపకూడదా అని ప్రశ్నించారు. కేవలం జగన్ మెప్పు కోసమే అప్పుడు కేటీఆర్ నిరసనలకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు. కమ్మ సామాజికవర్గం, రెడ్డి సామాజిక వర్గం నేతలపై కూడా కేటీఆర్ నీఛంగా మాట్లాడేవారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఆ రెండు సామాజిక వర్గాల నేతలు తమని మోసం చేశారని, తమకు జగన్ ఒక్కడే చాలని కేటీఆర్ చెప్పినట్టు సీఎం రమేష్ గుర్తు చేశారు.