బిఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చెప్పింది కొంతేనని, ఇంకా చెప్పాల్సింది చాలా ఉందని బిజెపి లోక్‌సభ సభ్యుడు రఘునందన్ రావు అన్నారు. కవిత అంత తొందరగా వదలరని పార్టీని స్థాపించి తీరుతారని రఘునందన్ రావు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. కవిత చెబుతున్న విషయాలను తాము చాలా కాలంగా చెబుతూనే ఉన్నామని ఆయన అన్నారు. అవినీతి పునాదులపై బిఆర్‌ఎస్ ఉందని ఆయన విమర్శించారు. కవిత ఇంకా పెద్దలు చేసిన అవినీతిని బయట పెడితే బాగుండేదన్నారు. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,
నవీన్‌రావు మోకిల్లా ప్రాజెక్టు అవతవకలు, అక్రమాల గురించి కూడా ఆమె బయట పెట్టాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి టి. హరీష్ రావు కుమ్మక్కైయ్యారని తాను చాలా కాలంగా చెబుతున్నానని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇరువురూ ఒకే విమానంలో, పక్కపక్క సీట్లలో కూర్చుని ప్రయాణం చేసినప్పుడే తన ఓటమికి కుట్ర చేశారని ఆయన తెలిపారు. జెడ్‌పి చైర్మన్‌గా తనను ఎవరు ఓడించారో కూడా తాను కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళానని ఆయన చెప్పారు.
కవిత కొత్త పార్టీ ?
కవిత చాలా పట్టుదల గల వ్యక్తి అని, అంత తొందరగా వదలరని ఆయన అన్నారు. తప్పకుండా కొత్త పార్టీ స్థాపిస్తారని రఘునందన్ రావు తెలిపారు. తమ పార్టీలో ఆమెను చేర్చుకోబోమని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.