Friday, August 22, 2025

ఆపరేషన్ సిందూర్‌తో యూరియా రాకలో జాప్యం: ఎంపి రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

ఆపరేషన్ సిందూర్ కారణంగా యూరియా రాకలో కొంత ఆలస్యం జరిగిందని మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విఆర్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు అందరికీ సరిపడే విధంగా త్వరలో యూరియా అందిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని రాష్ట్రాల పట్ల విపక్ష చూపుతున్నారని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం తప్పు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమన్యాయంతో చూస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను కాంగ్రెస్ నాయకులు తామే ఇచ్చామని చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, వారిపై వెంటనే కలెక్టర్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

యూరియా కోసం కొంతమంది కావాలనే చెప్పులను లైన్లో పెట్టి తక్కువ స్థాయి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.రైతులు తప్పుడు ఆరోపణలు నమ్మవద్దని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. అబద్ధపు ప్రచారాల కోసం బిజెపి దిగజారి రాజకీయాలు చేయదని అన్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేసే వారిపై వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా ప్రజలు చూస్తారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలు, ప్రతి అంగన్వాడీ కేంద్రానికి రూ.10 లక్షలు కేంద్రం నిధులను కేటాయించిందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలలో 26 అంగన్వాడీ కేంద్రాలకు రెండు కోట్లు 8 లక్షలు మంజూరు చేసిందని అన్నారు. మెదక్ జిల్లాలోని 27 అంగన్వాడి కేంద్రాలకు రెండు కోట్ల 10 లక్షలు మంజూరు కాగా అందులో మెదక్ ఎంపి పరిధిలోని 56 అంగన్వాడీ కేంద్రాలకుగాను నాలుగు కోట్ల ఆరు లక్షల నిధులు కేటాయింపు జరిగినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పనుల జాతర పేరిట ప్రారంభించే పనుల్లో 75% నిధులు కేంద్రం 25% మాత్రమే రాష్ట్రాల నుండి వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూది శ్రీకాంత్ రెడ్డి, నాయకులు గంప రామచంద్రరావు, కొత్తపల్లి వేణుగోపాల్ రెడ్డి, విభూషణ్, తొడపు నూరి వెంకటేశం, పట్టణ అధ్యక్షుడు బాసంగరి వెంకట్, ప్రధాన కార్యదర్శి కెమ్మసారం సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News