Monday, July 7, 2025

ప్రశాంతంగా బిబికా ఆలం ఊరేగింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః మొహర్రం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఊరేగింపులు ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చార్మినార్ వద్ద ఉండి బందోబస్తును పర్యవేక్షించారు. ఊరేగింపు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చారు. 10 రోజుల నుండి మొహర్రం సంతాప దినాలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు వేలమంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా పోలీసులు ముందస్తుగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బీబీ కా ఆలం భారీ ఊరేగింపు దబీర్‌పురా(దారుల్ షిఫా)లోని ఆషుర్‌ఖానా నుండి ప్రారంభమైంది. కర్ణాటక రాష్ట్రం నుండి తీసుకువచ్చిన లక్ష్మి ఏనుగుపై ‘ఆలం‘ను ఉంచి ఈ యాత్ర కొనసాగింది. అనంతరం ఊరేగింపు మూసీ నది ఒడ్డున ఉన్న మసీద్ -ఎ- ఇలాహీ, చాదర్‌ఘాట్ వద్ద ముగిసింది.

నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల సీనియర్ అధికారులతో కలిసి ఊరేగింపును పర్యవేక్షించారు. హైదరాబాద్ సిటీ పోలీసుల తరపున చార్మినార్ వద్ద ఆలంకు పూలమాలలు, దట్టీలు సమర్పించారు. బిబీకా ఆలం ఊరేగింపుకు 3,000 మందికి పైగా పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికలతో అన్ని చర్యలు చేపట్టారు. ఊరేగింపు ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన షియా కమ్యూనిటీ ప్రజలకు, నగర వాసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నగర అదనపు పోలీస్ కమిషనర్ విక్రం సింగ్ మాన్, జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, డిసిపిలు రక్షిత కృష్ణ మూర్తి , స్నేహా మెహ్రాతో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News