భావ్‌నగర్: త్వరలోనే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పరుగులు తీస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని ప్రయాణ కాలం కేవలం రెండు గంటలుగా ఉందని చెప్పారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ రైల్వే టర్మినస్ నుంచి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వర్చువల్‌గా ప్రారంభోత్సవం జరిపిన తరువాత విలేకరులతో మాట్లాడారు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనులు ఇప్పుడు శరవేగంతో సాగుతున్నాయి. త్వరలోనే ఈ రైలు ప్రారంభోత్సవ తేదీలు ఖరారు అవుతాయని మంత్రి వివరించారు. దేశంలోనే ఇది తొలి బుల్లెట్ ట్రైన్ అవుతుంది. రెండు నగరాల మధ్య 508 కిలో మీటర్ల దూరం అతి తక్కువ సమయంలో అదిగమించేందుకు వీలేర్పడుతుంది.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి ఇది బయలుదేరి గుజరాత్‌కు చేరుతుంది, మధ్యలో వాపి, సూరత్, ఆనంద్, వడోదర చివరిలో అహ్మదాబాద్ మజిలీలు ఉంటాయి. మోడీ హయాంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో 34000 కిలోమీటర్ల మేర నూతన రైల్వే ట్రాక్‌లు వేశారని తెలిపారు. పలు ప్రధాన రైల్వే స్టేషన్లను అత్యంత అధునాతన సౌకర్యాలతో సకాలంలో రైళ్ల రాకపోకలకు అంతరాయాలు లేకుండా పూర్తి చేసిన ఘనత కూడా ఈ 11 ఏండ్లలో సొంతం అయిందన్నారు.