ముంబై: వరుస విజయాలతో జోరుమీదున్న ముంబై ఇండియన్స్ మంగళవారం జరిగే కీలక పోరులో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. గుజరాత్ కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇరు జట్లు ఏడేసి విజయాలతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది. ముంబై చివరగా ఆడిన ఆరు మ్యాచుల్లోనూ గెలిచి జోరుమీదుంది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, లక్నో, రాజస్థాన్ వంటి బలమైన జట్లను ఓడించి ముంబై ఈ సీజన్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. గుజరాత్‌పై కూడా గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే లక్షంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై సమతూకంగా ఉంది. రాజస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది.
ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ శర్మలు ఫామ్‌లో ఉండడం జట్టుకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ఇద్దరు జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఈసారి కూడా వీరి నుంచి మెరుగైన ఆరంభాన్ని జట్టు ఆశిస్తోంది. రోహిత్ ఫామ్‌ను అందుకోవడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. ముంబై విజయాల్లో రోహిత్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టుకు అండగా నిలుస్తున్నాడు. సూర్య కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో తనవంతు సహఖారం అందిస్తున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్య, విల్ జాక్స్, నమన్ ధిర్ తదితరులతో ముంబై బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. దాదాపు ప్రతి బ్యాటర్ ఫామ్‌లో ఉండడంతో ముంబై వరుస విజయాలతో ముందుకు దూసుకు పోతోంది. ఇక ట్రెంట్ బౌల్ట్, కర్ణ్ శర్మ, దీపక్ చాహర్, బుమ్రా, హార్దిక్‌లతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న ముంబై ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
సవాల్ వంటిదే..
ఇక వరుస విజయాలతో జోరుమీదున్న ముంబై ఇండియన్స్‌ను ఓడించడం గుజరాత్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. గుజరాత్ కూడా నిలకడైన ఆటతో వరుస విజయాలను సాధిస్తోంది. అయితే పటిష్టమైన ముంబైను ఓడించడం అనుకున్నంత తేలికేం కాదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడగా రాణిస్తేనే గుజరాత్ గెలులు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్‌లు జోరుమీదున్నారు. వీరిద్దరూ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందిస్తున్నారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక జోస్ బట్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రూథర్‌ఫర్ట్, రషీద్ ఖాన్ వంటి స్టార్ బ్యాటర్లు జట్టులో ఉండనే ఉన్నారు. ఇక సిరాజ్, రబడా, ఇషాంత్, రషీద్, ప్రసిద్ధ్ కృష్ణ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు కూడా మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగానే ఉన్నాయని చెప్పొచ్చు.