దాదాపు ఇరవయ్యేళ్ల కిందట ముంబయి సబర్బన్ రైళ్లలో జరిగిన పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ ముంబయి హైకోర్టు ఇచ్చిన తీర్పు పోలీసు వ్యవస్థకు చెంపపెట్టులాంటిది. అదే సమయంలో, న్యాయం అందడంలో జరుగుతున్న అలవిమాలిన జాప్యాన్ని, న్యాయవ్యవస్థలోని లోటుపాట్లను కూడా ఈ తీర్పు ఎత్తిచూపుతోంది. 2006 జులై 11న బాగా రద్దీగా ఉండే ముంబయి పశ్చిమ రైల్వేలైన్‌లో ఏడు సబర్బన్ రైళ్లలోని ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంట్లలో ఐదు నిమిషాల వ్యవధిలో పేలిన బాంబులు 189 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నాయి. ఈ దుర్ఘటనలో 820 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన అనంతరం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) రంగంలోకి దిగి, ‘క్షుణ్ణంగా’ దర్యాప్తు చేసి 12 మందిని న్యాయస్థానం ముందు నిలబెట్టింది. సుదీర్ఘ విచారణ అనంతరం వీరిలో ఐదుగురికి మరణ శిక్ష, మిగిలిన ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ మోకా (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్) ప్రత్యేక కోర్టు 2015లో తీర్పు చెప్పింది.
ఈ తీర్పుపై మరణశిక్ష పడిన ఐదుగురు దోషులు హైకోర్టును ఆశ్రయించారు. గత పదేళ్లుగా పెండింగులో ఉన్న ఈ కేసుపై గత ఏడాది జులై నుంచి హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక ద్విసభ్య ధర్మాసనం రోజువారీ విచారణ జరుపుతోంది. దాదాపు పదేళ్ల తర్వాత సోమవారం 671 పేజీలతో సుదీర్ఘమైన తీర్పు వెలువరించిన ధర్మాసనం.. దర్యాప్తులో పోలీసు వ్యవస్థ లొసుగులను, లోటుపాట్లను ఎండగట్టింది. అభియోగాలను రుజువు చేయడంలోనే కాదు, సాక్షులుగా ప్రవేశపెట్టినవారి వాంగ్మూలాల్లోనూ ఏమాత్రం పస లేదని ధర్మాసనం తేల్చేసింది. నిందితులను హింసించి, బలవంతంగా నేరం ఒప్పించినట్లు కనబడుతోందన్న న్యాయమూర్తుల వ్యాఖ్యలకు యావత్తు పోలీసు శాఖ సిగ్గుతో తలవంచుకోవలసిందే. సరైన ఆధారాలు లేకుండా నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టమని కోర్టు కుండబద్దలు కొట్టింది. పేలుళ్లకు ఏ రకమైన పదార్థాన్ని వినియోగించారో కూడా చెప్పలేని దర్యాప్తు అధికారుల పనితనాన్ని ఆక్షేపించింది.
వీటన్నింటికీ మించి, పేలుళ్లు జరిగిన నాలుగేళ్లకు నిందితులను గుర్తించేందుకు పెరేడ్ నిర్వహించడం విధినిర్వహణలో దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. అంతకుమించి, నిందితుల కాల్ డేటాగా చెబుతూ సేకరించిన వివరాలను నిందితులకు చూపించకపోవడం, ఆ తర్వాత ఆ ఆధారాలను ధ్వంసం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టిన పన్నెండుమందీ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు చెందినవారుగా నిరూపించే సాక్ష్యాలేవీ సేకరించలేకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనం.
న్యాయస్థానాల్లో సుదీర్ఘంగా నడిచిన ఈ కేసు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇరవయ్యేళ్లపాటు జైళ్లలో మగ్గిపోయిన ఈ పన్నెండుమందీ ఎంతో విలువైన తమ జీవితకాలాన్ని కోల్పోయారు. అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇన్నేళ్లుగా వారి కుటుంబ సభ్యులు పడిన మనోవేదనకు కారకులు ఎవరు? దర్యాప్తులో హైకోర్టు ధర్మాసనం పేర్కొన్న లోపాలేవీ అంతకుముందు విచారించిన ప్రత్యేక కోర్టు దృష్టికి రాకపోవడం శోచనీయం. తాజాగా కోర్టు తీర్పుతో విడుదలైన పన్నెండుమందిలో అసలు నేరస్థులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే, ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలను, ఆధారాలను చూపించలేకపోవడం వల్లనే వీరంతా నిర్దోషులుగా విడుదలయ్యారన్న సంగతి గమనార్హం. ఒకవేళ వీరిలో ఎవరైనా ఆనాడు పేలుళ్లకు పాల్పడి ఉంటే, వారు విడుదలై, మళ్లీ సమాజంలోకి వచ్చినందుకు బాధ్యత వహించవలసింది పోలీసు వ్యవస్థే. దర్యాప్తును ఇంత లోపభూయిష్టంగా చేపట్టిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
ఇన్నేళ్లూ జైల్లో ఉన్నవారు నేరస్థులు కాకపోతే ఆనాటి పేలుళ్లకు కారకులెవరని ప్రశ్నిస్తున్న బాధిత కుటుంబాలకు పోలీసులు ఏం సమాధానం చెబుతారు? ఇక న్యాయవ్యవస్థ విషయానికొస్తే, న్యాయం అందడం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్లేనన్నది నానుడి. కానీ, న్యాయస్థానాల్లో కేసుల విచారణకు ఏళ్లూపూళ్లూ పడుతోందనడానికి ఈ కేసే ఓ తాజా ఉదాహరణ. 189 మంది మరణానికి దారితీసిన బాంబు పేలుళ్ల వంటి కీలకమైన కేసు తేలేందుకే దాదాపు ఇరవయ్యేళ్లు పడితే ఇక మామూలు కేసుల సంగతి ఏమిటి? హైకోర్టు తీర్పు పట్ల విస్మయం ప్రకటించిన మహారాష్ట్ర సర్కారు ఈ కేసుపై సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తక్షణమే విచారణ చేపట్టవలసిందిగా రాష్ట్రప్రభుత్వం చేసిన విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని, త్వరలో విచారణ ప్రారంభించేందుకు సర్వోన్నత న్యాయస్థానం సమ్మతించింది. ఈ కేసు తేలేసరికి ఎంత కాలం పడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జైలు గోడల మధ్య బతుకు వెళ్లదీసిన ఈ పన్నెండుమందినీ విచారణ సమయంలో మళ్లీ జైలుకు పంపకుండా ఉంటే, అదే పదివేలు!