భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు మళ్లీ విపత్తును ఎదుర్కొంటున్నాయి. ఏడాది క్రితం నాటి వరద బీభత్సం మళ్లీ ఇప్పుడు కనిపిస్తోంది. గత ఏడాది సెప్టెంబరు 1న మున్నేరు వరదవిలయంతో ఖమ్మం జిల్లా కేంద్రం ఛిన్నాభిన్నం కాగా, ఇప్పుడు అదే మున్నేరులో వరద నీరు పెరుగుతోంది. ప్రస్తుతం మున్నేరులో పది అడుగుల వద్ద నీరుంది. గత ఏడాది మున్నేరుకు వరదలు వచ్చి ఖమ్మం నగరం జలమయం అయింది. కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరుకు రిటైనింగ్ వాల్ నిర్మించకపోవడం, వరద పరిస్థితిపై ప్రజలను అప్రమత్తం చేయకపోవడం జలప్రళయానికి దారితీసిందని చెబుతున్నారు. మున్నేరుకు సమీపంలోని మొత్తం 25 కాలనీల్లో ఇళ్లల్లో 10 అడుగుల ఎత్తులో నీరు చేరింది.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో మున్నేరు వాగు కట్టకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ. 100 కోట్లు మంజురైనా అధికారుల అలసత్వం (Laxity officials) వల్ల ఆ పనులు పూర్తి కాలేదు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మున్నేరు వాగు ఉప్పొంగడానికి దారితీసే ఆకేరు వాగు ఎగువనున్న చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలించి వరద పరిస్థితిని ముందుగా పసికట్టగలిగితేనే ముప్పు తప్పుతుందని చెబుతున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది బుడమేరుకు వరదలు వచ్చాయి. బుడమేరు ప్రవాహం సజావుగా ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు ప్రమాదం అంచున నిలుస్తున్నాయి. 2005లో బుడమేరు ఉగ్రరూపం దాల్చి కొల్లేరులోకి చేరడంతో దాదాపు 44 లంక గ్రామాలు విపత్తుతో అల్లాడాయి. అప్పట్లో వారం రోజులపాటు విజయవాడ నగరం ముంపులో ఉండిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలకు నదుల్లో వరద నీరు ఉప్పొంగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం ఉదయానికి 2 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. బ్యారేజి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 589.20 అడుగులుగా నమోదైంది. దీంతో ప్రాజెక్టులో 26 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. ఈ పరిస్థితులన్నిటికీ ముఖ్య కారణం అక్రమ ఆక్రమణలు. నదీ ప్రవాహం ముందుకు సాగకుండా నిర్మాణాలు వెలుస్తుండటంతో భారీ వర్షాలు కురిసేటప్పుడు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
దేశంలోని ఇతర రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉంటోంది. దేశ వ్యాప్తంగా 1953 నుంచి 2018 మధ్యకాలంలో వరదల కారణంగా రూ. 4 లక్షల కోట్ల ఆస్తినష్టంతోపాటు లక్షమందికి పైగా ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో నాలుగు కోట్ల హెక్టార్ల భూమికి వరదల ముప్పు పొంచిఉందని జాతీయ వరదల సంఘం 1980 లోనే హెచ్చరించింది. ఈ మేరకు వరదలను ఎదుర్కోడానికి 207 సిఫార్సులు చేసింది. కానీ ఇంతవరకు ఎలాంటి ప్రణాళికలు చేపట్టలేదు. ముంబై, చెన్నై వంటి నగరాలు ఏటా భారీ వర్షాలకు తెప్పలుగా తేలిపోతున్నాయి. చెన్నైలో 1943, 1976, 1985, 1998, 2002, 2005, 2015లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. 2015లో చెన్నై సబర్బన్ ప్రాంతాల్లో 432 మంది ప్రాణాలు కోల్పోగా, 3.04 మిలియన్ మంది వరద బాధితులయ్యారు. మొత్తం రూ. 25,913 కోట్ల వరకు నష్టం వచ్చింది.
వరదల కారణంగానే 1953 2017 మధ్య కాలంలో తమిళనాడులో రూ. 27,326 కోట్ల వరకు నష్టం ఏర్పడింది. ఈ మధ్యకాలంలో 3705 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, సూరత్ తదితర నగరాలు పదేపదే భారీ వర్షాలతో వచ్చిన వరదలకు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ విపరీతాలకు మూల కారణం జలవనరులు ఆక్రమణలతో హరించుకుపోవడమే. అహ్మదాబాద్‌లో కొన్నేళ్ల క్రితం 190 చదరపు కిలోమీటర్ల పరిధిలో 603 చెరువులు ఉండగా, 2001 నాటికి ఆ సంఖ్య 137కు పడిపోయింది. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు వేల చెరువులుండేవి. కానీ రానురాను అవి హరించుకుపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 134 సరస్సులు ఆక్రమణల పాలైనట్టు గుర్తించారు.
ఈ సరస్సులు చుట్టూ 14,061 ఆక్రమణలు బయటపడ్డాయి. మొత్తం ఆక్రమణల్లో 85 శాతం కేవలం 30 నీటివనరుల్లోనే గుర్తించగా, 15 శాతం 104 సరస్సుల చుట్టూ ఉన్నట్టు కనుగొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక తెలంగాణలో హైడ్రా సంస్థ ఏర్పాటుతో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడం ప్రారంభమైంది. ప్రభుత్వ భూములు, చెరువుల కట్టడాలు, ఎఫ్‌టిఎల్ (ఫ్లడ్‌లెవెల్) జోన్‌లలోని అక్రమ కట్టడాలని కూల్చివేస్తోంది. అయినా ఇంకా చేపట్టవలసిన చర్యలు చాలా ఉన్నాయి. దేశంలో నగరాలు అత్యంత ఆధునికీకరణకు నోచుకుని మరింత విస్తరించడం మంచిదే అయినా దానికి తగ్గట్టు మౌలిక సౌకర్యాల విస్తరణ చేపట్టడం కూడా అంతే ముఖ్యం.
వరదలువంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నగరాలను హెచ్చరికల వ్యవస్థలతో చక్కగా తీర్చిదిద్దాలి. సమస్యలన్నిటికీ మూలకారణమవుతున్న అక్రమ నిర్మాణాలను నివారించగలగాలి. దీనికి ప్రజలనుంచి కూడా సహకారం అవసరం. కొంతమంది అక్రమార్కులు కోర్టులను ఆశ్రయించి అక్రమ నిర్మాణాల తొలగింపును అడ్డుకోవడం మనం చూస్తున్నాం. హైదరాబాద్ లోని హైడ్రా చేపట్టే అక్రమ నిర్మాణాల తొలగింపునకు ఇలాంటి ఉదంతాలే ఆటంకం కల్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా భారీ వర్షాల వల్ల ముంచుకొచ్చిన వరద నీటిని క్రమబద్ధీకరించి, నిల్వ చేసుకునే ఏర్పాట్లు లోపించడమే నగరాలు వరద విపత్తుకు బలవుతున్నాయి.