Saturday, July 26, 2025

మునక మాకు.. మున్నేరు జలాలు మీకా?

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల అనేక వాగుల, ఉపనదుల సమాహారం మున్నేరు. పాకాల ఏరుకు వట్టేరు, బయ్యారం అలిగేరు కలిసి మున్నేరుగా మారినచోట ముల్కనూరు సమీపంలో మున్నేరు ప్రాజెక్టు నిర్మిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గార్ల, కామేపల్లి, కారేపల్లి ఖమ్మం రూరల్, అర్బన్ మండలాలతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ మండలానికి సాగునీటితో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరుతాయి.35 రెవెన్యూ గ్రామాల ప్రజలు గత ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు కోసం కలలు కంటున్నారు. ప్రారంభంలో చంద్రగిరి ప్రాజెక్టుగా, తర్వాత రెండేర్ల గడ్డ ప్రాజెక్టుగా, చివరకు మున్నేరు ప్రాజెక్టుగా పిలవబడుతున్న ఈ ప్రాజెక్టు అనేక దశాబ్దాలపాటు సర్వేల పేరుతో కాలయాపనకు గురైంది.

చిట్టచివరకు 2009 జూన్ 24వ తేదీన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జిఒ నెం: 1076 ద్వారా 131.67 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం మంజూరు చేశారు. ఆరు మండలాల పరిధిలో 30,406 ఎకరాలకు సాగునీరు అందించటంతోపాటు బయ్యారం రక్షణ స్టీల్స్ కు (Protection steels) అవసరమైన నీటిని కూడా సరఫరా చేసే లక్ష్యంతో ప్రతిపాదించబడిన ఈ ప్రాజెక్టు నిర్మాణమైతే తమ కల నెరవేరుతుందని ప్రజలు ఆశించారు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ ప్రాజెక్టు మూలపడింది. అటు తర్వాత ఈ ప్రాజెక్టు కోసం రిప్రజెంటేషన్లు, ఆందోళనలు కొనసాగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై చేపట్టిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల క్రింద మున్నేరు ప్రతిపాదిత మేజర్ ఆయకట్టు సాగులోకి వస్తుందని, అందువలన ఈ ప్రాజెక్టుకు అంత ప్రాధాన్యత లేదని పక్కన పెట్టేశారు.

రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పనులు నడుస్తున్న క్రమంలో తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి, తెలంగాణలో కెసిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులను నిలిపివేసింది. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రూపొందించింది. 2016 ఫిబ్రవరి 16వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ టేకులపల్లి మండలం రోళ్ళపాడు చెరువులో సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూపకల్పన చేయబడిందని ఆ సందర్భంగా కెసిఆర్ ప్రకటించారు. ఆనాడు విడుదల చేసిన డిపిఆర్ నివేదికలో ఫస్ట్ ఫేజ్ లోనే రోళ్ళపాడు, బయ్యారం, గార్ల చెరువులకు నీళ్లు అందిస్తామని పేర్కొన్నారు. కాని ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు.

34 నెలల్లో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 10 సంవత్సరాలుగా సాగుతూనే వుంది. రూ. 14 వేల కోట్ల అంచనా వ్యయం రూ. 20 వేల కోట్లకు చేరి అందులో రూ. 10 వేల కోట్లకు పైగా ఖర్చు అయినా కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళివ్వలేదు. ప్రాజెక్టు లక్ష్యాన్ని నీరుగార్చి సీతారామ ప్రాజెక్టును కృష్ణా నది ఆయకట్టు స్థిరీకరణ ప్రాజెక్టుగా మార్చివేశారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రోళ్ళపాడు, బయ్యారం, గార్ల చెరువులను డిజైన్ నుండి తొలగించి మొదటి ఫేజ్ పనులను పక్కనబెట్టి రెండవ ఫేజ్ పనులైన కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ పనులను చేపట్టి పూర్తి చేసే దశకు చేరుకొన్నారు. దీని వలన భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల ఏజన్సీ రైతాంగానికి తీరని అన్యాయం జరిగింది.

దీనితో అటు మున్నేరు ప్రాజెక్టు రాక ఇటు సీతారామ ద్వారా వస్తాయనుకొన్న గోదావరి జలాలు చేజారిపోయిన స్థితిలో ప్రతిపాదిత మున్నేరు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు నిరాశలోకి కూరుకుపోయారు. ఈ స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హఠాత్తుగా మున్నేరు ప్రాజెక్టు నిర్మాణానికి 17- మే -2025 న రూ. 162.54 కోట్లు కేటాయిస్తూ జిఒ నెంబర్ 98 విడుదల చేసింది. ఇందులో ట్విస్టు ఏమిటంటే మున్నేరు ప్రాజెక్టు నీళ్లు సరాసరి పాలేరు జలాశయానికి పంపించడం కోసం మాత్రమే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించడం. మున్నేరు నుండి వృథాగా సముద్రంలో కలుస్తున్న పది టిఎంసిల నీటిని గ్రావిటీ కాల్వల ద్వారా సీతారామ ప్రాజెక్టు పాలేరు లింకు కెనాల్‌కు అనుసంధానం చేసి 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరపబోతున్నట్టు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లుచల్లి, ఈ ప్రాంత భూములకు మున్నేరు నీరు చుక్క కూడా ఇవ్వకుండా, ఏనాడూ కనీస పరిశీలనలో లేని పాలేరుకు తీసుకుపోవటం విస్మయాన్ని కలిగిస్తున్నది.

పరీవాహక ప్రాంత సమీప మండలాల అవసరాల కోసం ఐదు దశాబ్దాలుగా నలుగుతున్న ప్రాజెక్టు మున్నేరు. ఇప్పటివరకు జరిగిన ప్రతిపాదనలు, సర్వేలన్నీ ఈప్రాంత సాగునీటి అవసరాల కోసం జరిగినవే. ఇప్పటివరకు వున్న ప్రతిపాదనల ప్రకారం మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే సీతారామ ప్రాజెక్టు కింద దగా పడిన 6 మండలాలకు సాగునీరు అందించవచ్చు. అలాగే ప్రాజెక్టు నుండి తక్కువ ఖర్చుతో లిఫ్ట్ ద్వారా 6 కిలోమీటర్ల దూరంలో వున్న బయ్యారం చెరువుకు నీళ్ళిస్తే ఆ చెరువు ద్వారా గార్ల చెరువుతో పాటు 15 చిన్న చెరువులు, కుంటలకు నీళ్లు ఇవ్వవచ్చు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పాలేరు చెరువు ఇప్పటికే నాగార్జునసాగర్ ద్వారా కృష్ణా జలాలతో అనుసంధానించబడి రిజర్వాయర్‌గా మారింది.దాని క్రింద గల ఆయకట్టు స్థిరీకరణ కోసం ఆదివాసీ ప్రాంతానికి అన్యాయం చేస్తూ కృష్ణా బేసిన్‌లో ఉన్న పాలేరుకు గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తున్నారు.

ఇప్పుడు అదనంగా మున్నేరు నీళ్ళను కూడా తరలించుకుపోవటం ఖమ్మం జిల్లా మంత్రుల జలదోపిడీకి పరాకాష్ఠ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లు, నిధులు, నియామకాలలో అన్యాయం జరుగుతుందని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ముందుకు వచ్చింది. ఇప్పుడు స్వరాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్లు తమ ప్రాంత అభివృద్ధి కోసం వెనుకబడిన ఆదివాసీ ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొడుతూ నీళ్లన్నీటిని తరలించకపోతున్నారు. ఇది క్షమించరాని నేరం. తలాపున ఉన్న నీటిని తమ సాగునీటి అవసరాలకు వాడుకోవడం ఆ ప్రాంత ప్రజల హక్కు. మున్నేరు జలాలు ముమ్మాటికి పరీవాహక, పరిసర ప్రాంతాల ప్రజలవే. వారి అవసరాలు తీరిన తర్వాతనే మిగతా ప్రాంతాలకు వినియోగించుకోవాలి. మున్నేరు జలాల అక్రమ తరలింపుకు వ్యతిరేకంగా ఐక్య ఆందోళనకు పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ‘మున్నేరు జల రక్షణ కమిటీ’ గా ఏర్పడి ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామికవాదులు వీరి న్యాయమైన పోరాటానికి మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • గౌని ఐలయ్య
    94907 00955
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News